అండర్–19 టి20 ప్రపంచకప్‌లో మెరిసిన భారత అమ్మాయిలు
‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా గొంగడి త్రిష
అత్యధిక వికెట్లు తీసిన వైష్ణవి శర్మ
ఇదే నిలకడ కొనసాగిస్తే సీనియర్ జట్టులోకి ఖాయం
ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ ఆసాంతం రాణించిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం కాదు కదా... కనీసం కోలుకునే చాన్స్ కూడా ఇవ్వకుండా చెలరేగిపోయింది. వరల్డ్‌కప్ మొత్తం పరాజయం అన్నదే ఎరగకుండా ముందుకు సాగిన యువ భారత్... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ చాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఛేజింగ్ చేసిన టీమిండియా... అన్నీ మ్యాచ్‌ల్లోనూ రెండు వికెట్లు కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత బ్యాటింగ్ చేసే చాన్స్ వస్తే దంచి కొట్టడం... బౌలింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని కట్టిపడేయడం టోర్నీ మొత్తం ఇదే ప్రణాళిక అవలంబించి విజయవంతమైంది.
బ్యాటింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగితే... తమిళనాడు అమ్మాయి కమలిని ఆమెకు చక్కటి సహకారం అందించింది. బౌలింగ్‌లో స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పారుణిక సిసోడియా యువ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మెగా టోర్నీలో మన యంగ్ ‘స్టార్ల’ ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం
కమలిని కమాల్
టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తమిళనాడుకు చెందిన కమలిని 7 మ్యాచ్‌లాడి 143 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానం దక్కించుకున్న కమిలిని 35.75 సగటుతో పరుగులు రాబట్టింది. అందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కమలిని ‘సూపర్ సిక్స్’లో స్కాట్లాండ్‌తో పోరులో 51 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది.
ఇక ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో దంచికొట్టిన కమలిని 56 పరుగులు చేసి అజేయంగా జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ టోర్నీలో త్రిష విజృంభించడంతో ఆమె మెరుపుల ముందు కమలిని ప్రదర్శన మరుగున పడినా... జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఈ తమిళనాడు వికెట్ కీపర్ రాణించింది. అండర్–19 ఆసియా కప్‌లోనూ ఆకట్టుకున్న కమలినిని మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ రూ. 1 కోటీ 60 లక్షలకు కొనుగోలు చేసుకుంది.
ఇంట్లో సోదరులను చూసి క్రికెట్ ఆడటం నేర్చుకున్న కమలిని కొంత కాలం తర్వాత ఆటనే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించి తీవ్ర సాధన చేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిలకడగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కమలిని ముందుకు సాగుతోంది.
‘సూపర్’ సనిక
దక్షిణాఫ్రికాతో తుదిపోరులో ఫోర్ కొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చిన సనిక చాల్కె కూడా... ఈ టోర్నీలో తనదైన ముద్ర వేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో రైజింగ్ స్టార్ త్రిష త్వరగా అవుటైన సమయంలో అజేయంగా జట్టును గెలిపించిన ముంబైకి చెందిన సనిక... ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
దక్షిణాఫ్రికాతో తుదిపోరులోనూ ఓపెనర్ కమలిని తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... త్రిషతో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసింది. వరల్డ్‌కప్‌లో వైస్‌కెపె్టన్‌గానూ వ్యవహరించిన సనిక... మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
వైష్ణవి స్పిన్ మాయ
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన వైష్ణవి శర్మ... తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం రాణించిన వైష్ణవి 17 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వైష్ణవి రికార్డుల్లోకెక్కింది.
మలేసియాలోపై హ్యాట్రిక్ సహా కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన వైష్ణవి... మరో మూడు మ్యాచ్‌ల్లో మూడేసి వికెట్లు పడగొట్టింది. బంగ్లాదేశ్‌పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వైష్ణవి, స్కాట్లాండ్‌పై 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది.
‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్‌పై 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ మధ్యప్రదేశ్ స్పిన్నర్... ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 23 పరుగులిచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ స్పిన్‌తో తనదైన ముద్రవేసిన వైష్ణవి శ్రీలంకపై మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది.
పారుణిక ప్రతాపం
భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించగా... అందులో పారుణిక కూడా ఉంది. వైష్ణవి, ఆయుశికి తోడు తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ఢిల్లీకి చెందిన పారుణిక సిసోడియా ప్రత్యరి్థని వణికించింది. 6 మ్యాచ్‌లాడిన పారుణిక 5.80 సగటుతో 10 వికెట్లు పడగొట్టింది.
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 21 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టిన పారుణిక... ఫైనల్లో ప్రత్యరి్థని తన స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి... దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు వేయకుండా అడ్డుకట్ట వేసింది.
ఆయుశి అదరహో
ఒకవైపు తన స్పిన్‌తో వైష్ణవి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే... ఆమెకు ఆయుశీ శుక్లా తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను తికమిక పెట్టిన ఆయుశి వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లాడి 5.71 సగటుతో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్‌తో పోరులో 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆయుశి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
వైష్ణవి బౌలింగ్‌లోనైనా ప్రత్యర్థులు అడపాదడపా భారీ షాట్లు ఆడగలిగారు కానీ... ఆయుశి మాత్రం బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా కట్టిపడేసింది. వైవిధ్యమైన బంతులతో ఫలితం సాధించింది. వెస్టిండీస్‌పై 2 వికెట్లు, మలేసియాపై 3 వికెట్లు, శ్రీలంకపై ఒక వికెట్, ఇంగ్లండ్‌పై 2 వికెట్లు తీసి సత్తా చాటింది.
షబ్నమ్ సత్తా...
భారత మహిళల జట్టు వరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలవడంలో... మరో తెలుగమ్మాయి పాత్ర కూడా ఉంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 17 ఏళ్ల షబ్నమ్ షకీల్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. గత ప్రపంచకప్‌లోనూ బరిలోకి దిగిన ఈ తెలుగమ్మాయి. ఈసారి ఏడు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించిన ఈ టోర్నీలో పేసర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించింది. మెరుగైన ఎకానమీ నమోదు చేయడంతో పాటు... ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచి సహచర బౌలర్లకు వికెట్లు దక్కడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కేరళకు చెందిన జోషిత 6 మ్యాచ్‌లాడి 6 వికెట్లు పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment