
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 5) ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (52 బంతుల్లో 110 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ డంక్ (53 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో విరుచకుపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.
వాట్సన్, డంక్ ప్రతి ఒక్క భారత బౌలర్‌ను ఎడాపెడా వాయించారు. వీరిద్దరి దెబ్బకు ప్రతి భారత బౌలర్ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. వినయ్ కుమార్ 4 ఓవర్లలో 73,అభిమన్యు మిథున్ 4 ఓవర్లలో 46, పవన్ నేగి 3 ఓవర్లలో 34 (ఒక వికెట్), రాహుల్ శర్మ 4 ఓవర్లలో 42, ఇర్ఫాన్ పఠాన్ 2 ఓవర్లలో 31, గుర్కీరత్ సింగ్ మాన్ ఒక ఓవర్‌లో 15, స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 22 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్‌లో వెస్టిండీస్ మాస్టర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా వాట్సన్ శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కూడా వాట్సన్ 52 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.
కాగా, ఈ టోర్నీలో భారత మాస్టర్స్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‌లో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్‌కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు.
భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment