మోర్గాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా.. ఇంగ్లండ్‌ ఖాతాలో మరో ఓటమి | International Masters League 2025: Australia Masters Beat England Masters By 3 Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

మోర్గాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా.. ఇంగ్లండ్‌ ఖాతాలో మరో ఓటమి

Published Thu, Mar 13 2025 9:40 AM | Last Updated on Thu, Mar 13 2025 10:50 AM

International Masters League 2025: Australia Masters Beat England Masters By 3 Wickets

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఆరంభ ఎడిషన్‌ను (2025) ఇంగ్లండ్‌ మాస్టర్స్‌ ఒక్క విజయం కూడా లేకుండానే ముగించింది. నిన్న (మార్చి 12) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు.ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విధ్వంసకర హాఫ్‌ సెంచరీ.. బౌలింగ్‌లో టిమ్‌ బ్రేస్నన్‌ ఐదు వికెట్ల ఘనత వృధా అయ్యాయి.

ఇయాన్‌ మోర్గాన్‌ 64, టిమ్‌ ఆంబ్రోస్‌ 69 (నాటౌట్‌), ఫిల్‌ మస్టర్డ్‌ 17, డారెన్‌ మ్యాడీ 29, బ్రేస్నన్‌ 18 (నాటౌట్‌) పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పాట్టిసన్‌, మెక్‌గెయిన్‌, స్టీవ్‌ ఓకీటీ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. నాథన్‌ రియర్డాన్‌ (83), డేనియల్‌ క్రిస్టియన్‌ (61) విధ్వంసకర అర్ద శతకాలు బాది ఆసీస్‌ను గెలిపించారు. విజయానికి ముందు ఆసీస్‌ కొద్దిగా తడబడింది. 

19 ఓవర్లో బ్రేస్నన్‌ చెలరేగిపోయి కేవలం ఐదు పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే అప్పటికే ఆసీస్‌ గెలుపు ఖరారైపోయింది. చివరి ఓవర్‌ రెండో బంతిని వైడ్‌గా వేసిన సైడ్‌బాటమ్‌ ఆసీస్‌కు విన్నింగ్‌ రన్‌ను ఇచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో షాన్‌ మార్ష్‌ 20, బెన్‌ కట్టింగ్‌ 12, పీటర్‌ నెవిల్‌ 28, కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. ఆఖర్లో పాట్టిసన్‌, హిల్ఫెన్హాస్‌ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రేస్నెన్‌ 5, ర్యాంకిన్‌, పనేసర్‌ తలో వికెట్‌ తీశారు.

ఈ ఓటమితో ఇంగ్లండ్‌ ఒక్క విజయం కూడా లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌లు ఆడగా ఐదింట ఓడింది. మరోవైపు ఆసీస్‌ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సెమీఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో శ్రీలంక, భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ సెమీస్‌కు క్వాలిఫై కాగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 

తొలి దశ మ్యాచ్‌ల అనంతరం శ్రీలంక టాప్‌లో ఉండగా.. భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (మార్చి 13) జరుగబోయే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను ఢీకొంటుంది. రేపటి రెండో సెమీస్‌లో శ్రీలంక, వెస్టిండీస్‌ తలపడతాయి. రెండు సెమీఫైనల్లో విజేతలు మార్చి 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement