
సిడ్నీ: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగుల్ని సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. ఫలితంగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తరపున ఉన్న 1,598 పరుగుల రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ కొట్టి ఇరు జట్ల అత్యధిక వ్యక్తిగత వన్డే పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్(41) హాఫ్ సెంచరీకి చేరువలో పెవిలియన్ చేరాడు.
మరొకవైపు ఇంగ్లండ్ తరపున అత్యధిక వన్డే పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మోర్గాన్ నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే కెరీర్‌లో మోర్గాన్ సాధించిన పరుగులు 5,120. దాంతో ఇంగ్లిష్ క్రికెట్ జట్టు తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో మోర్గాన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో ఇయాన్ బెల్(5,416) కొనసాగుతున్నాడు.
ఆసీస్ లక్ష్యం 303
ఇంగ్లండ్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాస్ బట్లర్(100 నాటౌట్; 83 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించడంతో పాటు క్రిస్ వోక్స్(53 నాటౌట్; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ మూడొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఈ ఇద్దరూ 113 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 107 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. జాసన్ రాయ్(19), హేల్స్(1), బెయిర్ స్టో(39), జో రూట్(27) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్-బట్లర్‌లు మరమ్మత్తులు చేపట్టారు. అయితే మోర్గాన్(41) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత వోక్స్-బట్లర్ జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ముందుగా వోక్స్ హాఫ్ సెంచరీ సాధించగా, బట్లర్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.