
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో శ్రీలంక మాస్టర్స్ జోరు కొనసాగుతుంది. ఇంగ్లండ్ మాస్టర్స్‌తో నిన్న (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు నాకౌట్స్‌కు అర్హత సాధించింది. 4 మ్యాచ్‌లు ఆడినా ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇంగ్లండ్ మాస్టర్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. శ్రీలంక బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉడాన, దిల్రువన్ పెరీరా, గుణరత్నే, చతురంగ, జీవన్ మెండిస్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (10), టిమ్ ఆంబ్రోస్ (17), డారెన్ మ్యాడీ (15), టిమ్ బ్రేస్నన్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఉడాన బంతితో సత్తా చాటడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడు క్యాచ్‌లు పట్టాడు.
సంగక్కర విధ్వంసకర శతకం
స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ కుమార సంగక్కర విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. సంగ 47 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంగక్కరకు మరో ఎండ్‌లో ఎలాంటి సహకారం లభించనప్పటికీ.. ఒంటిచేత్తో శ్రీలంకను గెలిపించాడు.
లంక ఇన్నింగ్స్‌లో రొమేశ్ కలువితరణ 16, అసేల గుణరత్నే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. సంగక్కర సుడిగాలి శతకంతో చెలరేగడంతో శ్రీలంక 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది (వికెట్ కోల్పోయి). శ్రీలంక కోల్పోయిన ఏకైక వికెట్ (కలువితరణ) మాస్కరెన్హాస్‌కు దక్కింది.
ఈ గెలుపుతో ప్రస్తుత మాస్టర్స్ లీగ్ ఎడిషన్‌లో శ్రీలంక విజయాల సంఖ్య నాలుగుకు (5 మ్యాచ్‌ల్లో) చేరింది. భారత మాస్టర్స్‌తో ఆడిన మ్యాచ్ మినహా శ్రీలంక అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్ రెండో స్థానంలో ఉంది. భారత్ సైతం ఈ టోర్నీ ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. భారత్ ఒక్క ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతుల్లో మాత్రమే ఓడింది.
పాయింట్ల పరంగా భారత్, శ్రీలంక సమంగా ఉన్నప్పటికీ లంక రన్‌రేట్ భారత్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఆసీస్, విండీస్ తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండ్రెండు విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా నాలుగింట ఒకే ఒక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
కాగా, తొలిసారి జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 6 దేశాలకు చెందిన దిగ్గజ, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.