
పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ జట్టు సభ్యుడు, ఆ జట్టు స్టార్ టెస్ట్ క్రికెటర్ సౌద్ షకీల్ మ్యాచ్ సమయంలో నిద్రపోయి, అత్యంత అరుదైన రీతిలో (Timed Out) ఔటయ్యాడు. ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాకిస్తాన్ టెలివిజన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ జట్టుకు ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉండింది. అయితే షకీల్ గాడ నిద్రలోకి జారుకుని నిర్దేశిత మూడు నిమిషాల వ్యవధిలో క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. దీంతో ప్రత్యర్ధి కెప్టెన్ టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 128-1 స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, ప్రత్యర్థి జట్టు బౌలర్ మహ్మద్ షెహజాద్ వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను ఔట్ చేశాడు. వీరిద్దరి తర్వాత షకీల్ బరిలోకి దిగాల్సి ఉండింది. అయితే షకీల్ నిద్రపోయి క్రీజ్‌లోకి రాకపోవడంతో టైమ్డ్ ఔటయ్యాడు. తద్వారా షకీల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔటైన ఏడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ ఆలంను ఔట్ చేసిన మహ్మద్ షెహజాద్.. ఆతర్వాతి బంతికే మరో వికెట్ తీసి (షకీల్ వికెట్ కాకుండా) హ్యాట్రిక్ నమోదు చేశాడు. తద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ 205 పరుగులకే కుప్పకూలింది.
కాగా, రంజాన్ మాసం కావడంతో ప్రెసిడెంట్ కప్ గ్రేడ్-1 ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్‌ను రాత్రి వేళల్లో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు మొదలై మధ్య రాత్రి 2:30 గంటల వరకు కొనసాగుతాయి. అర్ద రాత్రి వేళ కావడంతోనే సౌద్ షకీల్ గాడ నిద్రలోకి జారుకున్నాడు. షకీల్ పాకిస్తాన్ తరఫున 19 టెస్ట్‌లు, 19 వన్డేలు ఆడాడు. షకీల్ టెస్ట్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 9 అర్ద సెంచరీల సాయంతో 1658 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో షకీల్ సగటు 50.2గా ఉంది. వన్డేల్లో షకీల్ 4 అర్ద సెంచరీల సాయంతో 408 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment