first class cricket
-
‘రంజీ’ సమరానికి వేళాయె!
న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి వేళైంది. నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో 32 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. టెస్టు సీజన్ కారణంగా భారత జట్టు ప్రధాన ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి అందుబాటులో లేకపోగా... వర్ధమాన ఆటగాళ్లు కూడా వివిధ సిరీస్‌ల వల్ల సీజన్లో అన్నీ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు కొత్తవాళ్లకు ఇదే సరైన అవకాశం. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... స్టార్ ప్లేయర్లు తప్ప మిగిలిన వాళ్లంతా వీలున్న సమయంలో ఈ టోర్నీలో పాల్గొననున్నారు. దేశవాళీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌పై బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో... యువ ఆటగాళ్లు అందరూ రంజీ ట్రోఫీ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తే చాలు జాతీయ జట్టుకు ఎంపికవొచ్చు అనే ఆలోచన ఆటగాళ్లకు రాకుండా... దేశవాళీల్లో రాణిస్తేనే టీమిండియా తలుపులు తెరుచుకుంటాయి అని బోర్డు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్లేయర్లు తమ శక్తియుక్తులను వాడేందుకు సిద్ధమయ్యారు. రంజీ సీజన్లోనే భారత జట్టు న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా గడప తొక్కొచ్చు అనే ఆలోచన కూడా ప్లేయర్ల మదిలో ఉంది. హైదరాబాద్ ఆకట్టుకునేనా? గత ఏడాది బలహీన జట్లున్న ప్లేట్ గ్రూప్‌లో అదరగొట్టి ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధించిన హైదరాబాద్ జట్టు పటిష్ట జట్లతో పోటీపడనుంది. టీమిండియా ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో నేడు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు నాగ్‌పూర్ వేదికగా విదర్భతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లోని ఎనిమిది జట్లు... తక్కిన జట్లతో ఆడనున్నాయి. లీగ్ దశ ముగిశాక నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఎనిమిది జట్లు నాకౌట్ దశ (క్వార్టర్ ఫైనల్స్)కు అర్హత పొందుతాయి. నేడు ప్రారంభం కానున్న లీగ్దశలో తొలి ఐదు లీగ్ మ్యాచ్‌లు నవంబర్ 16తో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు నెలల విరామం తర్వాత చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌ను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరిగే ఫైనల్‌తో రంజీ ట్రోఫీ సీజన్‌కు తెర పడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు మరోసారి భారీ బలగంతో బరిలోకి దిగుతోంది. దేశవాళీ దిగ్గజంగా గుర్తింపు సాధించిన ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా కీలకం కానున్నారు. ఖాన్ బ్రదర్స్‌లో... ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా... సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టుకు ఎంపివడం ఖాయమే. ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత ‘ఎ’ జట్టు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు కూడా పలు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో నయా హీరోలు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు దూరమైన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాతో పాటు... అడపా దడపా జట్టులోకి వచ్చి పోతున్న శ్రేయస్ అయ్యర్, గతంలో మెరుగైన ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయిన ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ వంటి వాళ్లు తిరిగి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక యశ్ ధుల్, సారాంశ్ జైన్, విద్వత్ కావేరప్ప, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి వాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు సమాయత్తమయ్యారు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ముంబై, బరోడా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్, సర్వీసెస్, మేఘాలయ, త్రిపుర. గ్రూప్ ‘బి’: ఆంధ్ర, హైదరాబాద్, గుజరాత్, విదర్భ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి. గ్రూప్ ‘సి’: బెంగాల్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్. గ్రూప్ ‘డి’: తమిళనాడు, ఢిల్లీ, సౌరాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, రైల్వేస్, అస్సాం. ప్రైజ్‌మనీ ఎంతంటే... విజేత: రూ. 5 కోట్లు రన్నరప్: రూ. 3 కోట్లు సెమీఫైనల్లో ఓడిన జట్లకు: రూ. 1 కోటి చొప్పునమ్యాచ్ ఫీజు ఎంతంటే (తుది జట్టులో ఉన్న వారికి) 40 లేదా అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 60 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 30 వేలు చొప్పున) 21 నుంచి 40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 50 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 25 వేలు చొప్పున) 1 నుంచి 20 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రూ. 40 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 20 వేలు చొప్పున). -
ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 20 ఫోర్లు, 21 సిక్సర్లతో..!
కౌంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..ససెక్స్‌పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్‌పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్‌షైర్ vs ససెక్స్, 2024తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016ఈ మ్యాచ్‌లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 202417 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్షైర్, 202216 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 199516 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011ఈ మ్యాచ్‌లో మరో ఆల్‌టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆల్‌టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024ఈ మ్యాచ్‌లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్‌షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్‌షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
అరుదైన మైలురాయిని చేరుకున్న పుజారా
నయా వాల్‌గా పేరుగాంచిన టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 61 శతకాలు, 77 అర్ధశతకాల సాయంతో 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25834), సచిన్ టెండూల్కర్ (25396), రాహుల్ ద్రవిడ్ (23794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20000 పరుగుల మార్కును తాకారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి వ్యక్తిగత మైలురాయిని దాటడంతో పాటు తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే ఇంకా 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (4/56), హర్ష్ దూబే (2/15), సర్వటే (2/22), ఆధిత్య థాక్రే (1/51), యశ్ ఠాకూర్ (1/57) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భను చిరాగ్ జానీ (4/14), ఉనద్కత్ (2/46), ప్రేరక్ మన్కడ్ (2/5), ఆదిత్య జడేజా (1/12) చావుదెబ్బ కొట్టారు. వీరి ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్ జివ్‌రజనీ (57), విశ్వరాజ్ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2 వికెట్లు తీశారు. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్ సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అథర్వ తైడే (42), హర్ష్ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో 2 వికెట్లు, ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు. -
12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. చరిత్రపుటల్లోకెక్కిన బీహార్ ఆటగాడు
12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేయడం ద్వారా బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ముంబైతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్‌లో బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్ పేరిట ఉంది. అలీముద్దీన్ 1942-43 రంజీ సీజన్లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అలీముద్దీన్ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డు ఎస్కే బోస్, మొహమ్మద్ రంజాన్ పేరిట ఉంది. బోస్.. 1959-60 రంజీ సీజన్లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్.. 1937 సీజన్లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి డెబ్యూ చేశాడు. ఈ ముగ్గురు వైభవ్ కంటే చిన్నవయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. వైభవ్.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్ కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్‌కు లోకల్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో ఇవాళ మొదలైన రంజీ మ్యాచ్‌లో వైభవ్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బుపేన్ లాల్వాని (65), సువేద్ పార్కర్ (50), తనుశ్ కోటియన్ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ 4, సకీబుల్ గనీ, హిమాన్షు సింగ్ తలో 2 వికెట్లు, అషుతోష్ అమన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!
ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియాకు ప్రాతినిథ్యం వహించిన పైన్.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం పైన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా టిమ్ పైన్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక పైన్ తన చివరి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో అతడు 95 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 2005లో సౌత్ ఆస్ట్రేలియాపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యధిక ఔట్లు చేసిన టాస్మానియన్ వికెట్ కీపర్‌గా పైన్(295) రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో దాదాపు 30 సగటుతో అతడు 4000కు పైగా పరుగులు చేశాడు. కాగా పైన్ కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన ('సెక్స్టింగ్') స్కాంలో పైన్ ఇరుక్కున్నాడు. దీంతో అతడు 2021లో కీలకమైన యాషెస్ ఆసీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది. Massive congratulations to @tdpaine36 on an exceptional career with the @TasmanianTigers and @CricketAus 💪 pic.twitter.com/0oDPUVhqRp — Brent Costelloe (@brentcostelloe) March 17, 2023 చదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్ -
ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం
పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. ఫిక్సింగ్ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్ కలకలం రేపింది. లెప్టార్మ్ స్పిన్నర్, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆసిఫ్ అఫ్రిది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది. 2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్ అఫ్రిది దేశవాళీ క్రికెట్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే -
బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. అయినా ఏం ప్రయోజనం..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 ఇన్నింగ్స్‌ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్లో బ్రాడ్‌మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి. అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్‌ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్‌ను మాత్రం ఎంపిక చేయట్లేదు. బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 43 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్‌మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు. Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9 Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8 Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz — Mohandas Menon (@mohanstatsman) October 2, 2022 43 ఇన్నింగ్స్‌ల తర్వాత బ్రాడ్‌మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్‌ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్‌మన్ 8 సార్లు నాటౌట్‌గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్‌కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్‌ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు. -
గుజరాత్ మాజీ వికెట్ కీపర్ కన్ను మూత..
సౌరాష్ట్ర, గుజరాత్ మాజీ వికెట్ కీపర్ జస్వంత్ బక్రానియా(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడాదృవీకరించింది. 'జస్వంత్ భాయ్ మృతి పట్ల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. 1970 నుంచి 1983 మధ్య బక్రానియా సౌరాష్ట్ర, గుజరాత్ తరపున 56 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అతని కెరీర్లో 3137 పరుగులతో పాటు ఐదు సెంచరీలు కూడా సాధించారు. అదే విధంగా కూడా 51 క్యాచ్‌లు, 12 స్టంఫౌట్లు కూడా తన కెరీర్లో ఉన్నాయి. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వివాదస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆటనుంచి కూడా అతను విరామం తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు టాస్మేనియా ప్రాక్టీస్ సెషన్లో అతను కూడా పాల్గొన్నాడు. అక్టోబర్ 6 నుంచి జరిగే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పెయిన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టిమ్ పైన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు. -
410 పరుగులు నాటౌట్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్ర
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కొత్త చరిత్ర నమోదైంది. గ్లోమోర్గాన్ బ్యాటర్ సామ్ నార్త్ఈస్ట్ 400 పరుగుల మార్క్‌ను సాధించాడు. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో భాగంగా శనివారం సామ్ నార్త్ఈస్ట్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 450 బంతుల్లో 45 ఫోర్లు, 3 సిక్సర్లతో 410 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో గ్లోమోర్గాన్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా సామ్ నార్త్ఈస్ట్ నిలిచాడు. తొలి స్థానంలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నాడు. 1994లో వార్విక్షైర్ తరపున లారా 501 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు లారా పేరిటే ఉంది. 2004లో ఇంగ్లండ్‌పై అంటింగ్వా వేదికగా లారా 400 పరుగులు నాటౌట్ చేశాడు. టెస్టుల్లో ఏకైక క్వాడ్రపుల్ సెంచరీ(400) లారా పేరు మీద ఉండడం విశేషం. సామ్ నార్త్ఈస్ట్కు జతగా జి.కూక్ 227 బంతుల్లో 191 నాటౌట్ రాణించడంతో గ్లోమోర్గాన్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 795 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 𝗙𝗢𝗨𝗥 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗! Sam Northeast becomes the first Glamorgan player ever to reach 4⃣0⃣0⃣ 👏 𝐒𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥. It also brings up the 450 partnership! 🤯 𝗪𝗮𝘁𝗰𝗵 𝗹𝗶𝘃𝗲: https://t.co/F3GGp6mm3i#LEIvGLAM | #GoGlam pic.twitter.com/DFrFk15QUW — Glamorgan Cricket 🏏 (@GlamCricket) July 23, 2022 చదవండి: END Vs SA: ఇంగ్లండ్ కెప్టెన్ అద్బుత విన్యాసం.. మార్క్రమ్ డైమండ్ డక్ -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్.. బెంగాల్ జట్టు ప్రపంచ రికార్డు
రంజీ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్ సెంచరీతో మెరిశారు. బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్ఫర్డ్ అండ్ కేమ్బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెంగాల్ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65, మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగిన షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53 నాటౌట్, ఆకాశ్‌దీప్( 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జార్ఖండ్ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ సౌరబ్ తివారీ 25, విరాట్ సింగ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ నిజామ్ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ కుమార్ డియోబ్రాత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్ Bengal Creates History!#Cricket #FirstClassCricket #Bengal #RanjiTrophy pic.twitter.com/BN8gziQNrB — CRICKETNMORE (@cricketnmore) June 8, 2022 -
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత
Sean Whitehead Took All 10 Wickets Innings First Class Match.. సౌతాఫ్రికా ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్లో అద్భుతం చోటుచేసుకుంది. సాతాఫ్రికాకు చెందిన ఫస్ట్‌క్లాస్ లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ సీన్ వైట్‌హెడ్ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఫోర్ డే ఫ్రాంచైజీ 2021-22 సిరీస్‌లో భాగంగా సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్స్, ఈస్ట్రన్ స్ట్రోమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీన్ వైట్‌హెడ్ మ్యాజికల్ స్పెల్ నమోదు చేశాడు. ఇంకో విశేషమేమిటంటే తొలి ఇన్నింగ్స్‌లోనూ సీన్ 5 వికెట్లు తీశాడు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రన్ స్ట్రోమ్స్ సీన్ దెబ్బకు 65 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సీన్ వైట్‌హెడ్ 12 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఈ పది వికెట్లలో.. రెండు స్టంప్స్ రూపంలో.. మూడు ఎల్బీ రూపంలో.. నాలుగు క్యాచ్‌ల రూపంలో.. మరొకటి కాట్ అండ్ బౌల్డ్ వికెట్ ఉంది. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 15 వికెట్లు తీసి మ్యాచ్‌ను శాసించిన సీన్ సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్స్‌కు 120 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. కాగా సౌతాఫ్రికా డమొస్టిక్ క్రికెట్ హిస్టరీలో సీన్ వైట్హెడ్ది రెండో ఉత్తమ ప్రదర్శనగా నమోదైంది. 1906లో లెగ్‌స్పిన్నర్ బెర్ట్ వాగ్లర్ ఒక ఇన్నింగ్స్‌లో 26 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. తాజాగా 115 ఏళ్ల తర్వాత సీన్ వైట్‌హెడ్ 10 వికెట్ల ఉత్తమ ప్రదర్శనతో మెరవడం విశేషం. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్! -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద సిక్స్.. వీడియో వైరల్
సిడ్నీ: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద సిక్స్ నమోదైంది. షెఫీల్డ్ షీల్డ్ 2021-22 టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్ హిల్టన్ కార్ట్‌రైట్ 122 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాగా అతను కొట్టిన మూడు సిక్స్ల్లో ఒకటి గ్రౌండ్ అవతల చాలా దూరంలో పడింది. ఇన్నింగ్స్ 114వ ఓవర్ నాలుగో బంతిని స్ట్రెయిట్ సిక్స్‌గా బాదాడు. ఫీల్డర్‌కు క్యాచ్ తీసుకునే అవకాశం లేకుండా మైదానం అవతల రోడ్డుపై పడింది. కనీసం బంతి ఎక్కడ పడిందో అని చూద్దామని అనుకున్నా కెమెరా కంటికి చిక్కలేదు. ఇంతలో ఒకతను వచ్చి బంతిని మైదానంలోకి విసిరాడు. కాగా కార్ట్‌రైట్ కొట్టిన సిక్స్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనే అతిపెద్ద సిక్స్‌గా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం ఇక కార్ట్‌రైట్ 2017లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుమ్యాచ్ ద్వారా ఆసీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే ఒక టెస్టుకు మాత్రమే పరిమితమైన అతను మూడు వన్డేలు ఆడాడు. కార్ట్‌రైట్ తన చివరి వన్డేను టీమిండియాపై ఆడగా.. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ తీయడం విశేషం. ఓవరాల్‌గా ఆసీస్ తరపున టెస్టు, వన్డేలు కలిపి నాలుగు మ్యాచ్‌లాడి 57 పరుగులు చేశాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన కార్ట్‌రైట్ 55 బీబీఎల్ మ్యాచ్‌ల్లో 924 పరుగులు సాధించాడు. చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు.. 'That's one of the biggest strikes we've ever seen here' 😲😲 Hilton Cartwright seeing them well at Karen Rolton Oval! #SheffieldShield pic.twitter.com/el78ndMBof — cricket.com.au (@cricketcomau) September 25, 2021 -
భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్
ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మనన్ శర్మ భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. అందుకే భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా త్వరలోనే యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడేందుకు కాలిఫోర్నియా బయలుదేరి వెళుతున్నట్లు మనన్ శర్మ స్ఫష్టం చేశాడు. చదవండి: భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్ 2017లో ఢిల్లీ తరపున భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన మనన్ శర్మ 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1208 పరుగులు(ఒక సెంచరీ.. 8 అర్థసెంచరీలు) ,113 వికెట్లు తీశాడు.ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 560 పరుగులు చేసిన మనన్ శర్మ 26 టీ20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీశాడు. ఇక 2016లో మనన్ శర్మను రూ.10 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కాగా ఢిల్లీ క్రికెట్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్లతో మనన్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. కాగా మనన్ శర్మ తండ్రి అజయ్ శర్మ భారత మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. 1988లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అజయ్ శర్మ టీమిండియా తరపున 31 వన్డేలు.. ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతలో దోషిగా తేలిన అజయ్ శర్మపై జీవితకాల నిషేదం పడింది. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరమయ్యాడు. చదవండి: నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం -
74 పరుగులకే ఆలౌట్.. అండర్సన్ అరుదైన ఘనత
మాంచెస్టర్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోను అదరగొడుతున్నాడు. తాజాగా కౌంటీ క్రికెట్లో భాగంగా లంకాషైర్ తరపున ఆడుతున్న అండర్సన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. (10-5-19-7)తో అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్ జాక్ క్రాలే, జోర్డాన్ కాక్స్, ఓలీ రాబిన్సన్, హీనో కుహ్న్, జాక్ లీనింగ్, మాట్ మిల్నెస్, హ్యారీ పొడ్రమ్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ముగ్గురు బ్యాట్స్మెన్లు డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. అనంతరం లంకాషైర్ ఇన్నింగ్స్ కూడా తడబాటుతోనే ప్రారంభమైంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. స్టీవెన్ క్రాఫ్ట్ 8, రాబ్ జోన్స్ 7 పరుగులతో ఆడుతున్నారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అండర్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 162 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 617 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కౌంటీ క్రికెట్లో బిజీగా ఉన్న అండర్సన్ ఆ తర్వాత భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 1️⃣0️⃣0️⃣0️⃣ first-class wickets @jimmy9 👏 Anderson has taken a 5-fer in 7 overs 🐐 Watch Anderson bowl here 👉 https://t.co/uJK9OLMTgs pic.twitter.com/j2535JaiAP — LV= Insurance County Championship (@CountyChamp) July 5, 2021 -
రంజీ ట్రోఫీకి బ్రేక్
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ (మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లు) రంజీ ట్రోఫీకి 2020–2021 సీజన్లో బీసీసీఐ విరామమిచ్చింది. కరోనా కారణంగా ఈ సీజన్లో చాలా సమయం కోల్పోయిన కారణంగా తాజా సీజన్లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించలేమని బీసీసీఐ ప్రకటించింది. 1934–35లో రంజీ ట్రోఫీ మొదలైన తర్వాత టోర్నీ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి. ‘ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీ, రాష్ట్ర సంఘాలతో రంజీ ట్రోఫీ నిర్వహణపై చర్చించాం. అయితే 2020 ఇప్పటికే ముగిసిపోగా... ప్రస్తుత సంవత్సరంలోనే కొత్త సీజన్ క్యాలెండర్లో మళ్లీ రంజీ ట్రోఫీ జరపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌కు రంజీ ట్రోఫీని పక్కన పెట్టాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దానికి బదులుగా పరిమిత ఓవర్ల టోర్నీలు నిర్వహించడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఏజీఎంలో రంజీ ట్రోఫీని కచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ విషయంలో పట్టుదల కనబర్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు నిర్వహించలేమని వివిధ రాష్ట్ర సంఘాలు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. 2019–2020 సీజన్‌కుగాను రంజీ ట్రోఫీ టైటిల్‌ను సౌరాష్ట్ర జట్టు గెల్చుకుంది. మహిళలకు వన్డే టోర్నీ... తాజా సీజన్లో రంజీ ట్రోఫీని పక్కన పెట్టిన బీసీసీఐ మరో మూడు టోర్నీలను మాత్రం అధికారికంగా ప్రకటించింది. టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ తరహాలోనే ‘బయో బబుల్’లో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరిగే అండర్–19 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో ఉంచుకొని దేశవాళీ అండర్–19 టోర్నీని (వినూ మన్కడ్ ట్రోఫీ) కూడా బోర్డు నిర్వహిస్తుంది. వీటితో పాటు మహిళల వన్డే టోర్నమెంట్‌ను కూడా జరుపుతామని బోర్డు ప్రకటించింది. అయితే ఈ మూడు టోర్నీల తేదీలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు ఆడబోయే సిరీస్‌ల విషయంలో కూడా బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని టోర్నీలు, సిరీస్‌లు కరోనా కారణంగా రద్దయ్యాయి. 2020 మార్చి 8న జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మన మహిళల జట్టు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు! తమిళనాడు X బరోడా అహ్మదాబాద్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండు మాజీ చాంపియన్ జట్లు తమిళనాడు, బరోడా నేడు జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం విశేషం. దినేశ్ కార్తీక్ సారథ్యంలో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన తమిళనాడు గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు బరోడా జట్టు కూడా తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. బరోడా గెలిస్తే ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెల్చుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. బరోడా జట్టు 2012, 2014లలో... తమిళనాడు 2007లో చాంపియన్‌గా నిలిచాయి. -
పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే
కరాచీ: టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్‌లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో వన్డే తరహా ఇన్నింగ్స్‌లను చూడడం అరుదు.. అలాంటిది పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్‌తో అదుర్స్ అనిపించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ బ్యాట్స్‌మన్ అంత ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో చివరి వికెట్ పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ట్రోపిని ఇరుజట్లు పంచుకున్నాయి. అయితే ఇదంతా పాక్ దేశవాళి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చోటుచేసుకుంది.(చదవండి : బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?) క్వాయిడ్-ఎ-అజామ్ టోర్నీలో భాగంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, సెంట్రల్ పంజాబ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా సెంట్రల్ పంజాబ్ ముందు 355 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి సెంట్రల్ జట్టు 202 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హసన్ అలీ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. టీ20 తరహాలో 61 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా అలీ మాత్రం సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని విధ్వంసం ధాటికి కొండంత లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. సెంట్రల్ పంజాబ్ 319 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయినా.. జట్టు చివరి బ్యాట్స్‌మన్ వకాస్ మసూద్ సహకారంతో అలీ తన బ్యాటింగ్ కొనసాగిస్తూ.. 355 పరుగుల దాకా తీసుకొచ్చి స్కోరును సమం చేశాడు. ఇంకా ఒక్క పరుగు చేస్తే సెంట్రల్ పంజాబ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఉండేది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకుంది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) ఇన్నింగ్స్ 118వ ఓవర్‌ను సాజిద్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులను సమర్థంగా ఎదుర్కొన్న వకాస్ మసూద్‌ను సాజిద్ తన మూడో బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సెంట్రల్ పంజాబ్ 355 పరుగుల వద్ద చివరి వికెట్ కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో సెంచరీ చేసి కూడా జట్టును గెలిపించలేకపోయాననే భావనతో హసన్ అలీ నిరాశగా మైదానంలో కూలబడ్డాడు. కేవలం ఒక్క పరుగు చేసుంటే సెంట్రల్ పంజాబ్ విజయం దక్కడంతో పాటు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన అలీ మ్యాచ్ ఆఫ్ ది స్టార్‌గా నిలిచేవాడు.కాగా ఈ వీడియోనూ ఐసీసీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'అలీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.. పాపం తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో.. ఏ గ్రేట్ షో బై హసన్ అలీ ' అంటూ కామెంట్లు పెడుతూ అలీని పొగడ్తలలో ముంచెత్తారు. 🇵🇰 INCREDIBLE SCENES 🤯 Central Punjab captain Hasan Ali smoked 106* from 61 on the last day of the Quaid-e-Azam Trophy final 🔥 With scores level, Khyber Pakhtunkhwa's Sajid Khan snared the final wicket to leave the match tied and the trophy shared! 🏆pic.twitter.com/x1GSZIa4ks — ICC (@ICC) January 5, 2021 -
లారా ఆ రికార్డు సాధించి 26 ఏళ్లు..
జమైకా : క్రికెట్ ప్రపంచానికి బ్రియాన్ లారా పరిచయం అవసరం లేని పేరు. సమాకాలీన క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ధీటుగా పరుగులు సాధించిన వ్యక్తి. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400*నాటౌట్) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి లారా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 501*పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ అద్భుతం జరిగి నేటికి 26 ఏళ్లవుతుంది.(ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 30,000 మంది..) జూన్ 6, 1994లో వార్విక్షైర్ తరపున ప్రాతినిధ్యం వహించిన లారా ఎడ్జ్బాస్టడ్ వేదికగా దుర్హమ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఈ రికార్డును సాధించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో పాకిస్తాన్‌కు చెందిన హనీఫ్ మహ్మద్ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును లారా బద్దలుకొట్టాడు. మొత్తం 474 నిమిషాల పాటు క్రీజులో ఉన్న లారా 427 బంతులెదుర్కొని 501 పరుగులు చేశాడు. కాగా ఇన్నింగ్స్ మధ్యలో లారా 12, 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభతర క్యాచ్‌లను అప్పటి వికెట్ కీపర్ క్రిస్ స్కాట్ వదిలివేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఫలితంగా లారా జాన్ మోరిస్ బౌలింగ్‌లో కవర్‌డ్రైవ్ కొట్టి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. అంతేగాక ఆ సీజన్లో వార్విక్షైర్ తరపున లారా 8 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లలో 7 శతకాలతో 89.82 సగటుతో మొత్తం 2006 పరుగులు సాధించాడు. అయితే అప్పటికే విండీస్ జట్టులో సభ్యుడైన లారా రెండు నెలల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. సిరీస్‌లో చివరి టెస్టులో లారా 538 బంతులెదుర్కొని 375 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 45 ఫోర్లు ఉన్నాయి. సమకాలీన క్రికెట్లో అద్భుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించిన లారా 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్థశతకాలు ఉన్నాయి. కాగా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేసిన లారా 261 ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 22,156 పరుగులు సాధించాడు. ఇందులో 65 శతకాలు, 88 అర్థసెంచరీలు ఉన్నాయి.(గల్లీ క్రికెట్: గేల్‌కు పాండ్యా ఛాన్స్) -
ఒక్క ఓవర్లో 77 పరుగులా !
వెల్లింగ్టన్ : క్రికెట్లో ఏదైనా సాధ్యమే. ఎవరూ ఊహించని రికార్డులు బద్దలవడం, బౌలింగ్‌లో రికార్డు గణాంకాలు నమోదవడం వంటివి చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఒక బౌలర్ ఒక ఓవర్లో 6 నుంచి 10 పరుగులు ఇస్తుంటాడు. ఒకవేళ మరీ దారుణంగా బౌలింగ్ వేస్తే 30 పరుగులు ఇస్తుంటారు. అయితే ఒకే ఓవర్లో ఒక బౌలర్ 77 పరుగులు ఇవ్వడం ఎపప్పుడైనా విన్నారా ! అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990 న చోటుచేసుకుంది. అయితే ఈ ఫేలవ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఫిబ్రవరి 20) వెల్లింగ్టన్, కాంటర్బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో కాంటర్బరీకి వెల్లింగ్టన్ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భాగంగా కాంటర్బరీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయింది. ఆ సమయంలో క్రీజులో ఎల్కే జర్మన్ (160 నాటౌట్), రోజర్ ఫోర్డ్ (14 నాటౌట్) ఉన్నారు. ఇక కాంటర్బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కాబట్టి ఉన్న రెండు వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని కాంటర్బరీ, మరోవైపు రెండు వికెట్లు తీస్తే.. విజయాన్ని సాధించవచ్చని వెల్లింగ్టన్ భావించాయి. దీంతో మ్యాచ్‌ను గెలవాలని వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్ అయిన రాబర్ట్ వాన్స్‌కు ఇచ్చాడు. (‘రిషభ్.. నీ రోల్ ఏమిటో తెలుసుకో’) అయితే రాబర్ట్ వాన్స్ ఆ ఓవర్లో ఏకంగా 22 బంతులు వేశాడు.. అందులో 17 నోబాల్స్ ఉండడం విశేషం. ఇక కాంటర్బరీ బ్యాట్స్‌మెన్ జర్మన్ ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్ సెంచరీ కూడా చేయడం విశేషం. ఈ ఓవర్ దెబ్బకు కాంటర్బరీ చివరి ఓవర్లో 18 పరుగులు చేస్తే విజయం దక్కించుకునేది. అప్పటికే సెంచరీతో జోరుమీదున్న జర్మన్ ఊపుచూస్తే.. కాంటర్బరీ సునాయాసంగా గెలిచేలాగా కనిపించింది. ఇవాన్ గ్రే వేసిన చివరి ఓవర్లో కాంటర్బరీ జట్టు 5 బంతుల్లో 17 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్ చివరి బంతిని ఎదుర్కొన్న రోజర్ ఫోర్డ్ సింగిల్ తీయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జర్మన్ వీరోచిత ఇన్నింగ్స్ వృధాగా మిగిలిపోయింది. రాబర్ట్ వాన్స్ మాత్రం ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అయితే ఈ చెత్త రికార్డు మాత్రం క్రికెట్ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కలేదు. బహుశా భవిష్యత్తులో ఏ బౌలర్ కూడా ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు ఇవ్వడేమో!. ఇప్పటికి క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 77 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు మాత్రం రాబర్ట్ వాన్స్‌పైనే ఉంది. కాగా రాబర్ట్ వాన్స్ 135 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ తరపున 4 టెస్టులు, 8వన్డేలు ఆడాడు.(అతనేమీ సెహ్వాగ్ కాదు.. కానీ) -
రెండు ఇన్నింగ్స్‌లలోనూ డబుల్ సెంచరీలు
కొలంబో: ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా అరుదైన రికార్డును నమోదు చేశాడు. లంక దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో పెరీరా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. లంక క్రికెట్లో రెండు పటిష్ట జట్లు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఎన్సీసీ జట్టుకు కెప్టెన్ అయిన ఏంజెలో తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 201 పరుగులు... రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 231 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఈ ఫీట్ రెండో సారి మాత్రమే నమోదు కావడం విశేషం. దాదాపు 81 ఏళ్ల క్రితం 1938లో కెంట్ బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్ ఇదే తరహాలో 244, 202 నాటౌట్ పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున 4 వన్డేలు, 2 టి20లు ఆడిన 28 ఏళ్ల ఏంజెలో 2016 ఆగస్టులో జట్టులో స్థానం కోల్పోయాడు. -
అంబటి రాయుడు సంచలన నిర్ణయం
హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి తనదైన ముద్ర వేసిన టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వైట్‌బాల్ గేమ్‌పై మాత్రమే దృష్టి పెట్టదల్చుకున్న రాయుడు.. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు లేఖ రాశాడు. ‘ నేను హైదరాబాద్‌కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్‌సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడతాను’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. అంబటి రాయుడు ఆకస్మిక నిర్ణయంతో టెస్టు ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్పినట్లయ్యింది. గురువారం నుంచి రంజీ ట్రోఫీ ఆరంభమైన తరుణంలో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కల్గించింది. 2013-14 సీజన్లో భాంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు రాయుడు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత టెస్టుల్లో చోటు సంపాదించలేకపోయాడు. దాంతో తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా రాయుడు ఆడలేదు. కాగా, వన్డేల్లో కూడా నిలకడలేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రాయుడు.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాయుడు నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి కోహ్లి నుంచి కూడా భరోసా దొరికింది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే ఫోకస్ చేయదలుచుకున్న రాయుడు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. -
కౌంటీల్లో దూసుకుపోతున్న ఇషాంత్
బర్మింగ్‌హామ్: కౌంటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత పేసర్ ఇషాంత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టిన విషయం తెలిసిందే. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా పేసర్ సీమర్ వార్విక్‌షైర్‌పై 5 వికెట్లు తీసి ఫామ్‌లోకొచ్చాడు. తాజాగా బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 120 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఇషాంత్.. కెరీర్లో తొలిసారి అర్ధ శతకం చేశాడు. తద్వారా 100కు పైగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో ఇషాంత్ చేరాడు. కౌంటీ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా లీసెస్టర్‌లో వావ్రిక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో 141 బంతులాడిన పేసర్ ఇషాంత్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 66 పరుగులు సాధించాడు. 182 నిమిషాల పాటు క్రీజులో నిలవడం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అంతకుముందు 31 పరుగులే ఇషాంత్‌కు అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ససెక్స్ టీమ్ స్కోరు 240/7 వద్ద శుక్రవారం తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాంత్.. శనివారం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు బర్గెస్తో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
క్రికెటర్ బద్రీనాథ్ అరుదైన ఘనత
వల్సాడ్ (గుజరాత్):హైదరాబాద్ క్రికెట్ కెప్టెన్ సుబ్రమణియన్ బద్రీనాథ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో పదివేల పరుగుల క్లబ్లో చేరాడు. చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్ సందర్భంగా బద్రీనాథ్(134) శతకం బాది పదివేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఫస్ట్ క్లాస్‌ల్లో పదివేల పరుగులను పూర్తి చేసుకున్న 47వ భారతీయ క్రికెటర్‌గా బద్రీనాథ్ నిలిచాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 55.19 సగటుతో 10,045 పరుగులు బద్రీనాథ్ సాధించాడు. 2000-01 సీజన్లో తమిళనాడు రాష్ట్రం తరపున బద్రీనాథ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 250. 2009లో ముంబైపై అత్యధిక స్కోరు బద్రీనాథ్ సాధించాడు. ఇదే తన కెరీర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అని బద్రీనాథ్ తాజాగా పేర్కొన్నాడు. దాంతో పాటు రంజీల్లో తమిళనాడు జట్టును మూడుసార్లు ఫైనల్‌కు చేర్చడంలో తన పాత్రను గుర్తు చేసుకున్నాడు.ఆ తరువాత తాను విదర్భ జట్టుకు ఆడానని, తాను ఆ జట్టు తరపున పాల్గొన్న తొలి సీజన్లోనే నాకౌట్ అర్హత సాధించామన్నాడు. ఇవన్నీ తన కెరీర్లో మరిచిపోలేనివని బద్రీనాథ్ స్పష్టం చేశాడు.