ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 43 ఇన్నింగ్స్‌ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో బ్రాడ్‌మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి.
అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్‌ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్‌ను మాత్రం ఎంపిక చేయట్లేదు.
బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు.
కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 43 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్‌మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు.
Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns
— Mohandas Menon (@mohanstatsman) October 2, 2022
Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9
Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8
Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz
43 ఇన్నింగ్స్‌ల తర్వాత బ్రాడ్‌మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్‌ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్‌మన్ 8 సార్లు నాటౌట్‌గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్‌కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్‌ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment