నయా వాల్‌గా పేరుగాంచిన టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 61 శతకాలు, 77 అర్ధశతకాల సాయంతో 51.96 సగటున 20013 పరుగలు చేశాడు.
పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25834), సచిన్ టెండూల్కర్ (25396), రాహుల్ ద్రవిడ్ (23794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 20000 పరుగుల మార్కును తాకారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు.
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి వ్యక్తిగత మైలురాయిని దాటడంతో పాటు తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే ఇంకా 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (4/56), హర్ష్ దూబే (2/15), సర్వటే (2/22), ఆధిత్య థాక్రే (1/51), యశ్ ఠాకూర్ (1/57) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భను చిరాగ్ జానీ (4/14), ఉనద్కత్ (2/46), ప్రేరక్ మన్కడ్ (2/5), ఆదిత్య జడేజా (1/12) చావుదెబ్బ కొట్టారు. వీరి ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది.
ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్ జివ్‌రజనీ (57), విశ్వరాజ్ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2 వికెట్లు తీశారు. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్ సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అథర్వ తైడే (42), హర్ష్ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో 2 వికెట్లు, ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment