రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి | Ranji Trophy Quarter Finals: Gujarat Beat Saurashtra By Innings 98 Runs | Sakshi
Sakshi News home page

రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి

Published Tue, Feb 11 2025 2:48 PM | Last Updated on Tue, Feb 11 2025 3:16 PM

Ranji Trophy Quarter Finals: Gujarat Beat Saurashtra By Innings 98 Runs

రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో చిరాగ్‌ జానీ (69), రెండో ఇన్నింగ్స్‌లో హార్విక్‌ దేశాయ్‌ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు.

కలిసికట్టుగా రాణించిన గుజరాత్‌ బౌలర్లు 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్‌ గజా 4, జయ్‌మీత్‌ పటేల్‌, సిద్దార్థ్‌ దేశాయ్‌ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్‌ జానీ హాఫ్‌ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్‌ దేశాయ్‌ (22), పుజారా, షెల్డన్‌ జాక్సన్‌ (14), వసవద (39 నాటౌట్‌), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్‌ (14) రెండంకెల స్కోర్లు చేశారు.

జయ్‌మీత్‌, ఉర్విల్‌ సెంచరీలు
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్‌మీత్‌ పటేల్‌ (103), ఉర్విల్‌ పటేల్‌ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్‌ హింగ్‌రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్‌ (45), చింతన్‌ గజా (39), విశాల్‌ జేస్వాల్‌ (28), ప్రియాంక్‌ పంచల్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్‌ జానీ 4, జయదేశ్‌ ఉనద్కత్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్‌ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్‌ (2), చింతన్‌ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం​ సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో హార్విక్‌ దేశాయ్‌ (54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చిరాగ్‌ జానీ (26), షెల్డన్‌ జాక్సన్‌ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్‌ (29) రెండంకెల స్కోర్లు చేశారు.

మిగతా మూడు క్వార్టర్‌ ఫైన‍ల్స్‌లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్‌ కశ్మీర్‌, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement