
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించనుంది. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది.
ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్‌కు చేరుతుంది.
దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్‌కు అర్హత సాధించింది.
1957-58 సీజన్‌లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్‌లో సెమీస్‌కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్‌కోర్-కొచ్చిన్ టీమ్‌గా రంజీల్లో ఆడింది.
మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.
విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment