
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన నెల రోజుల్లోనే పాకిస్తాన్ మరో మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. పాక్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ జరిగే తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటింస్తారు. లాహోర్ వేదికగా ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ జరుగుతాయని తెలుస్తుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా పాక్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే భారత్, పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. భారత్ 2013లో కూడా మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాడు మెజార్టీ మ్యాచ్‌లు ముంబైలో జరగగా.. పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ కటక్‌లో జరిగాయి.
కాగా, పాకిస్తాన్ 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి (ఛాంపియన్స్ ట్రోఫీ-2025) ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో చివరిగా 1996 పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరిగింది. ఈ టోర్నీకి పాక్‌తో పాటు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అప్పటినుంచి భద్రతా కారణాల రిత్యా పాక్‌లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా జరగలేదు.
మళ్లీ 29 ఏళ్ల తర్వాత పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో కూడా అన్ని మ్యాచ్‌లు పాక్‌లో జరగడం లేదు. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్ ఇదివరకే ఫైనల్‌కు చేరడంతో ఫైనల్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. ఈ టోర్నీలో పాక్ ఒక్క విజయం కూడా సాధించకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment