వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్ నెగ్గిన భారత అమ్మాయిల జట్టు
టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం
త్రిష ఆల్‌రౌండ్ షోకు ‘ఫైనల్ వార్’ వన్‌సైడ్
బౌలింగ్‌లో 3/15, బ్యాటింగ్‌లో 44 నాటౌట్
త్రిషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్‌ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్‌రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్‌లో కనబరిచిన ఆల్‌రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్‌లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది.
సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్‌సైడ్ అయ్యింది.
కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది.
ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది.
మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్‌తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్‌రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది.
స్పిన్ వలలో విలవిల
దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది.
రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది.
ధనాధన్
ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్‌ను ఓపెనర్ త్రిష తన షాన్‌దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్‌తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్‌విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్‌తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3.
భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్‌తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్‌విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0.
Comments
Please login to add a commentAdd a comment