రెండుసార్లు అండర్–19 ప్రపంచకప్ గెలవడం చిరస్మరణీయం
ఇక సీనియర్ స్థాయిపై దృష్టి
కౌలాలంపూర్ నుంచి ‘సాక్షి’తో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ త్రిష
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది?
ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్‌లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్‌కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను.
‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన?
2023లో జరిగిన ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
వరల్డ్‌కప్‌నకు ముందు ఎలాంటి సాధన చేశారు?
కెరీర్‌లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్‌కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్‌గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది.
జట్టు సభ్యులతో మీ అనుబంధం?
చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్‌లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం.
ఈ వరల్డ్‌కప్‌లో మీకు అప్పగించిన బాధ్యతలు?
ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం.
గత ప్రపంచకప్‌నకు, ఈ వరల్డ్‌కప్‌నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి?
2023లో జరిగిన ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి.
మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది?
కేవలం ఈ ప్రపంచకప్‌లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్‌కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను.
భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి?
అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా.
టోర్నీలో త్రిష గణాంకాలు
మ్యాచ్‌లు 7
ఇన్నింగ్స్‌లు 7
పరుగులు 309
అత్యధిక స్కోరు 110
సగటు 77. 25
సెంచరీలు 1
ఫోర్లు 45
సిక్స్‌లు 5
అభినందనల వెల్లువ
అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
అండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment