
ఇవాళ (మార్చి 5) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది.
డారిల్ మిచెల్ 49 పరుగులతో (37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు.
మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది.
కాగా, తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆసీస్‌పై ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో విరాట్ కోహ్లి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
చరిత్ర సృష్టించిన కేన్
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమం
నేటి మ్యాచ్‌లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్‌లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది.
రచిన్ రికార్డు శతకం
ఈ మ్యాచ్‌లో సెంచరీతో రచిన్ కూడా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు (5) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో రచిన్‌కు ఇది రెండో శతకం కాగా.. అంతకుముందు భారత్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో మూడు సెంచరీలు బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment