టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి ఆడాడు. అతడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియంకు తరలివచ్చారు.
కానీ కింగ్ కోహ్లి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అద్బుతమైన బంతితో కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కోహ్లి ఔటయ్యాక స్టేడియం నుంచి అభిమానులు వెళ్లిపోయారు.
సాంగ్వాన్‌ను మెచ్చుకున్న కోహ్లి..
కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షును కింగ్ కోహ్లి ప్రశంసించినట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. సాంగ్వాన్ తాను వికెట్ తీసిన బంతిపై సంతకం చేయమని కోహ్లి వద్దకు వెళ్లి అడిగాడంట. అందుకు కోహ్లి.. వాట్ ఎ బాల్.. అద్బుతమైన డెలివరీ సంధించావు అని కొనియాడినట్లు సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది.
గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ఫ్యాన్స్..
మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు రక్షణ వలయాన్ని ఛేదించుకొని విరాట్ కోసం ముగ్గురు అభిమానులు మైదానంలోకి పరుగులు తీయడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ తొలి రోజు గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చిన అభిమాని అతడి కాళ్లు మొక్కగా... శనివారం ముగ్గురు అభిమానులు సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
‘గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. కోహ్లి భయ్యా క్రేజ్‌కు ఇది నిదర్శనం. మైదానంలో దూసుకొచి్చన వాళ్లను కొట్టకండి అని కోహ్లి సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు’ అని ఢిల్లీ స్పిన్నర్ శివమ్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌తో కోహ్లి ఫొటోలు దిగాడు.
ఢిల్లీ ఘన విజయం..
ఇక విరాట్ కోహ్లికి తన సహచరులు గెలుపు కానుక ఇచ్చారు. కోహ్లికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండానే ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా మూడు రోజుల్లో ముగిసిన పోరులో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 334/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు... చివరకు 106.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది.
సుమిత్ మాథుర్ (206 బంతుల్లో 86; 8 ఫోర్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు. రైల్వేస్ బౌలర్లలో హిమాన్షు సాంగ్వాన్ 4, కునాల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ జట్టు 30.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ సైఫ్ (31) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో శివమ్ శర్మ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సుమిత్ మాథుర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.
చదవండి: Rohit Sharma: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను
Comments
Please login to add a commentAdd a comment