విరాట్ కోహ్లి (PC: PTI)
రంజీ ట్రోఫీ పునరాగమనంలో విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలమైనా.. అతడి జట్టు ఢిల్లీ మాత్రం ఘన విజయం సాధించింది. రైల్వేస్(Railways Team)ను ఏకంగా ఇన్నింగ్స్ పందొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లి ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రైల్వేస్ జట్టుతో గురువారం మొదలైన మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఢిల్లీ తరఫున సొంతమైదానంలో అడుగుపెట్టాడు. దీంతో కోహ్లి ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో తొలిరోజు.. కోహ్లికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాట్‌తో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. కరతాళ ధ్వనులు, ఆర్సీబీ... ఆర్సీబీ... కోహ్లి... కోహ్లి... అనే అభిమానుల నినాదాల మధ్య ఉదయమే అతడు క్రీజులోకి వచ్చాడు.
15 బంతుల్లోనే ముగిసిన ముచ్చట
అప్పటికే ఐదు వేల పైచిలుకు ప్రేక్షకులు మైదానంలోకి వచ్చేశారు. అయితే కోహ్లిని 6 పరుగుల వద్దే హిమాన్షు క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరింత మంది అభిమానులు స్టేడియం లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు.
కనీసం అతడిబ్యాట్ నుంచి ఫిఫ్టీ వచ్చినా వేలసంఖ్యతో తొలిరోజులాగే అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయేది.కానీ.. పుష్కర కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ ముచ్చట 15 బంతుల్లోనే ముగిసింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే సూపర్‌స్టార్ కోహ్లి విఫలమైనప్పటికీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన బదోని సేన.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ స్కోరు చేసింది.
బదోని కెప్టెన్ ఇన్నింగ్స్
టాపార్డర్‌లో ఓపెనర్లు అర్పిత్ రాణా(10), సనత్ సంగ్వాన్(30).. వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్(32) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరోవైపు.. కోహ్లి ఆరు పరుగులకే అవుట్ కాగా.. ఆయుశ్ బదోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 77 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు.
మూడో రోజే ముగిసిన కథ
ఇక బదోనికి తోడుగా సుమిత్ మాథుర్ 86 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రణవ్ రాజువన్షీ 39 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో 374 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించిన ఢిల్లీ.. శనివారం నాటి మూడో రోజు ఆటలో రైల్వేస్ కథను ముగించింది.
సూరజ్ అహుజా బృందాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి.. ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ శివం శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మోనీ గరేవాల్, ఆయుశ్ బదోని ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయడంతో పాటు.. ఓవరాల్‌గా మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సుమిత్ మాథుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రోహిత్‌కు మాత్రం పరాభవం
ఏదేమైనా రంజీ రీఎంట్రీలో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపించలేకపోయినప్పటికీ.. విజయంతో తిరిగి వెళ్లడం విశేషం. మరోవైపు.. రంజీ పునరాగమనం(జనవరి 23)లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బ్యాటర్(3, 28)గా అతడి వైఫల్యం ముంబై జట్టుపై ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్ చేతిలో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
విరాట్ కోహ్లికి సన్మానం
ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) తమ స్టార్ క్రికెటర్ కోహ్లిని సత్కరించింది. అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న తమ ఆటగాడిని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ శాలువకప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా మెమెంటోను బహూకరించారు. మూడేళ్ల క్రితమే 2022లోనే కింగ్ కోహ్లి వంద టెస్టుల మార్క్ దాటాడు. కానీ రంజీల బరిలోకి దిగకపోవడంతో ఆత్మీయ సత్కారం కోసం డీడీసీఏ ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment