జీవం పోసింది మనమే! | What galvanized! | Sakshi
Sakshi News home page

జీవం పోసింది మనమే!

Published Sat, Sep 26 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

జీవం పోసింది మనమే!

జీవం పోసింది మనమే!

భారత్‌తోనే తొలి సిరీస్ ఆడిన దక్షిణాఫ్రికా
ఏడు సార్లు పర్యటించిన సఫారీలు
సొంతగడ్డపై మనదే పైచేయి

 
 వర్ణ వివక్ష కారణంగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న దక్షిణాఫ్రికాను తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకొచ్చింది భారత్. 1991లో సఫారీలను ఆహ్వానించి వన్డే సిరీస్ ఆడారు. ఈ 24 ఏళ్లలో భారత్‌లో ఏడుసార్లు దక్షిణాఫ్రికా జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. సహజంగానే సొంతగడ్డపై బలమైన భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా... సఫారీలు కూడా కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మరో సిరీస్ నేపథ్యంలో... గత సిరీస్‌లను ఒక్కసారి పరిశీలిస్తే...  
 

 1991-92 (3 వన్డేలు)
 కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో పరిమితికి మించి రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వచ్చిన ప్రేక్షకుల సమక్షంలో భారత్, దక్షిణాఫ్రికా తొలివన్డే జరిగింది. ఈ మ్యాచ్‌తో పాటు గ్వాలియర్‌లో జరిగిన రెండో వన్డేనూ గెలుచుకొని భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. అయితే న్యూఢిల్లీలో మూడో మ్యాచ్ గెలిచి బోణీ చేసిన ఆనందంతో దక్షిణాఫ్రికా  వెనుదిరిగింది.
 హైలైట్స్: 22 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఈ సిరీస్‌తో అలెన్ డొనాల్డ్‌లాంటి దిగ్గజ బౌలర్ వెలుగులోకి వచ్చాడు.
 ఫలితం:  2-1తో భారత్ సిరీస్ గెలిచింది.
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సంజయ్ మంజ్రేకర్, కెప్లర్ వెసెల్స్.
 
 1996-97 (3 టెస్టులు, వన్డే టోర్నీ)
 పూర్తి స్థాయి జట్టుతో దక్షిణాఫ్రికా తొలి సారి భారత పర్యటనకు వచ్చింది. అహ్మదాబాద్‌లో తొలి టెస్టులో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీనాథ్ (6/21) ధాటికి కుప్పకూలి దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే కోల్‌కతాలో రెండో టెస్టులో ఆ జట్టు 329 పరుగులతో  ఘనవిజయం సాధించింది. కానీ కాన్పూర్‌లో మాత్రం భారత్  280 పరుగులతో గెలిచింది. ఫలితం: 2-1తో టెస్టు సిరీస్ భారత్ గెలిచింది.
 హైలైట్స్: 74 బంతుల్లో సెంచరీతో భారత రికార్డు సమం చేసిన అజహర్, వీవీఎస్ లక్ష్మణ్ అరంగేట్రం, కెరీర్ తొలి టెస్టులోనే క్లూస్‌నెర్ అద్భుత బౌలింగ్ (8/64) ప్రదర్శన.
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: అజహరుద్దీన్.
 వన్డే ప్రదర్శన: టైటాన్ కప్ ముక్కోణపు టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.
 
 1999-2000 (2 టెస్టులు, 5 వన్డేలు)
 భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచిన అరుదైన ఘనతను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. 14 సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇది సొంతగడ్డపై తొలి ఓటమి. అయితే ఈ పర్యటనకు సంబంధించే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం ఆ తర్వాత బయటపడటం దీనిని వివాదాస్పద సిరీస్‌గా మిగిల్చింది. ముంబైలో తొలి టెస్టులో 4 వికెట్లతో నెగ్గిన సఫారీలు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టును ఇన్నింగ్స్, 71 పరుగులతో గెలుచుకున్నారు.
 హైలైట్స్: టెస్టు సిరీస్ ముగియగానే తాను కెప్టెన్సీనుంచి తప్పుకుంటానని నాలుగు రోజుల ముందు సచిన్ ప్రకటిం చడం సంచలనం సృష్టించింది. అజ హర్ పునరాగమనంతో పాటు కపిల్ కోచ్‌గా రావడమే కారణమని వార్తలు వచ్చాయి. సిరీస్‌లో నమోదైన ఏకైక సెంచరీ చేసిన అజహర్‌కు ఫిక్సింగ్ వివాదంతో రెండో టెస్టే ఆఖరిది అయింది.

 ఫలితం: 2-0తో సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్:  జాక్ కలిస్
 వన్డే సిరీస్ ఫలితం: 3-2తో గెలిచిన భారత్
 హైలైట్స్: సౌరవ్ గంగూలీ నాయకత్వంలో తొలిసారి భారత్ బరిలోకి దిగింది. చివరిదైన నాగపూర్ వన్డేలోనే క్రానే, బోయె, విలియమ్స్ ఫిక్సింగ్ చేసినట్లు కొద్ది రోజులకు ఢిల్లీ పోలీసులు బయట పెట్టారు.
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సచిన్ టెండూల్కర్.
 
 2004-05 (2 టెస్టులు)
 గిబ్స్, బోయెలను పోలీ సులు విచారించబోరని హామీ ఇస్తేనే సిరీస్ ఆడతామని మెలిక పెట్టిన దక్షిణాఫ్రికా చివరకు వారిద్దరినీ జట్టునుంచి తప్పించి భారత్‌కు వచ్చింది.  కాన్పూర్‌లో తొలి టెస్టు నిస్సారమైన డ్రా కాగా, కోల్‌కతాలో రెండో టెస్టు భారత్ 8 వికెట్లతో గెలుచుకుంది. షెడ్యూల్ గందరగోళం కారణంగా వన్డేల నిర్వహణ సాధ్యం కాలేదు.
 సిరీస్ ఫలితం: 1-0తో భారత్ విజయం
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్:  వీరేంద్ర సెహ్వాగ్.
 
 2005-06 (5 వన్డేలు)
 దక్షిణాఫ్రికా వన్డేల కోసం మ ళ్లీ భారత్‌కు వచ్చింది. వర్షం కారణంగా చెన్నై వన్డే రద్దుకాగా, ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచాయి.
 హైలైట్స్: ఈ సిరీస్‌కు గంగూలీని తప్పించారనే ఆగ్రహంతో కోల్‌కతా వన్డేలో దాదాపు 80 వేల మంది ప్రేక్షకులు భారత జట్టుకు, కెప్టెన్ ద్రవిడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారు. మ్యాచ్ తర్వాత కోచ్ గ్రెగ్ చాపెల్ మైదానం బయట వేలితో సంజ్ఞ చేయడం కొత్త వివాదాన్ని రేపింది.  
 ఫలితం: 2-2తో సిరీస్ సమం.
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: గ్రేమ్ స్మిత్, యువరాజ్ సింగ్.
 
 2007-08 (3 టెస్టులు)
 చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో డ్రాగా ముగిసింది. అహ్మదాబాద్‌లో రెండో టెస్టులో స్టెయిన్ (5/23) దెబ్బకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 90 పరుగులతో చేజార్చుకుంది. కాన్పూర్‌లో మూడో టెస్టును భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది.
 హైలైట్స్: కెరీర్‌లో రెండో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్, ఈ ఘనత సాధించిన బ్రాడ్‌మన్, లారాల సరసన చేరాడు. కుంబ్లే గాయంతో కాన్పూర్ టెస్టుతో తొలిసారి ధోని భారత టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
 ఫలితం: 1-1తో సిరీస్ సమం
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: హర్భజన్ సింగ్.
 
 2009-10 (2 టెస్టులు, 3 వన్డేలు)
 నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టును దక్షిణాఫ్రికా గెలుచుకోగా, కోల్‌కతాలో తర్వాతి మ్యాచ్‌ను గెలిచి భారత్ సిరీస్ సమం చేసింది.
 హైలైట్స్: ఆమ్లా 3 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 490 పరుగులు నమోదు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, ధోని సెంచరీలు సాధించడం విశేషం.
 ఫలితం: 1-1తో టెస్టు సిరీస్ సమం; మ్యాన్ ఆఫ్ ద సిరీస్: హషీం ఆమ్లా
 వన్డే సిరీస్‌లో జైపూర్, గ్వాలియర్‌లలో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే దక్షిణాఫ్రికా వశమైంది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 58 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
 హైలైట్స్: ప్రపంచ వన్డే చరిత్రలో తొలి డబుల్ సెంచరీ ఈ సిరీస్‌లోనే నమోదైంది. రెండో వన్డేలో సచిన్  200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
 ఫలితం: 2-1తో సిరీస్ భారత్ వశం
 మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సచిన్ టెండూల్కర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement