బై... బై... కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్‌కు గ్రేమ్ స్మిత్ వీడ్కోలు
ఆస్ట్రేలియాతో ఆడుతున్నదే ఆఖరి మ్యాచ్
కెరీర్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం వీడ్కోలు చెప్పాడు. కలిస్ వైదొలిగి రెండు నెలలు కాకముందే... దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఆటకు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు తనకు ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాడు. తన చివరి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే అవుటైన స్మిత్.. భారంగా కెరీర్‌ను ముగించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్.
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాను టెస్టుల్లో నంబర్‌వన్ చేయడంలో... అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన జట్టుగా మార్చడంలో అత్యంత కీలక పాత్ర గ్రేమ్ స్మిత్‌ది. తను ఆడిన 117 టెస్టుల్లో ఏకంగా 109 టెస్టులకు సారథిగా పని చేసిన దిగ్గజం అతను. ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్... అనూహ్యంగా మ్యాచ్ మధ్యలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన తర్వాత తన నిర్ణయాన్ని సహచరులకు చెప్పాడు. చివరి టెస్టులో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 (5, 3) పరుగులు మాత్రమే చేశాడు. ‘నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయం ఇదే. ఏడాది నుంచి రిటైర్మెంట్‌పై ఆలోచిస్తున్నా. న్యూలాండ్స్ నాకు సొంతగడ్డ లాంటిది. అందుకే ఇక్కడే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇకపై కుటుంబ సభ్యులతో గడుపుతా’ అని స్మిత్ చెప్పాడు.
కెరీర్ హైలైట్స్
మొత్తం 117 టెస్టుల్లో 109 మ్యాచ్‌లకు స్మిత్ సారథిగా వ్యవహరించాడు. (ఇందులో 108 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు, ఒక్క మ్యాచ్‌లో ఐసీసీ ఎలెవన్‌కు కెప్టెన్సీ చేశాడు.)
కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (53). పాంటింగ్ (48) స్మిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో స్మిత్ సెంచరీ చేసిన ప్రతిసారీ (27 సెంచరీలు) దక్షిణాఫ్రికా గెలిచింది.
వంద టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఒకే ఒక్క క్రికెటర్ స్మిత్. బోర్డర్ (93) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో 149 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. ఇందులో దక్షిణాఫ్రికా 92 గెలిచి, 51 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా... మిగిలిన మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
టి20ల్లో 27 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా దక్షిణాఫ్రికా 18 మ్యాచ్‌ల్లో నెగ్గి, 9 మ్యాచ్‌ల్లో ఓడింది.
స్మిత్ అంతర్జాతీయ కెరీర్...
టెస్టు వన్డే టి20
మ్యాచ్‌లు 117 197 33
పరుగులు 9265 6989 982
సెంచరీలు 27 10 0