
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కోచ్ పదవి నుంచి జాన్ లూయిస్ తప్పుకొన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు యాషెస్ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడంతో జాన్ లూయిస్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2022 నుంచి జాన్ ఇంగ్లండ్ మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... ఆ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది.
ఇక వేర్వేరు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లోనూ ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు.
జట్టులో ప్రతిభకు లోటు లేదు. మరో మెరుగైన కోచ్‌ను నియమిస్తాం. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకముంది’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: హైదరాబాద్ పరాజయం
గువాహటి: జాతీయ అండర్–23 మహిళల వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మమత సారథ్యంలోని హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 49.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ గొంగడి త్రిష (14 బంతుల్లో 3) విఫలమవ్వగా... కెప్టెన్, వికెట్ కీపర్ మమత (83 బంతుల్లో 77; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
సాక్షి రావు (37 బంతుల్లో 36; 1 ఫోర్), కావ్య (63 బంతుల్లో 30; 3 ఫోర్లు) రాణించారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో గరీమా యాదవ్, సోనమ్ యాదవ్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఏక్తాకు 2 వికెట్లు లభించాయి.
అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించి విజయం ఖరారు చేసుకుంది. తృప్తి సింగ్ (99 బంతుల్లో 73; 10 ఫోర్లు), ముస్కాన్ మాలిక్ (92 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లలో కేసరి ధృతి, సాక్షి రావు ఒక్కో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment