
photo courtesy: star sports
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్.. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ, ఇంగ్లండ్‌పై ఆఫ్ఘన్ల గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన కలిగిన ట్రాట్.. నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు అన్నీ తానై వ్యవహరించి, ఆఫ్ఘన్ల గెలుపుకు దోహదపడ్డాడు. ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్‌తో పాటు భారత పిచ్ పరిస్థితులపై కూడా సంపూర్ణ అవగాహన (2011లో భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ట్రాట్ ఇంగ్లండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు) కలిగిన ట్రాట్.. ఆఫ్ఘన్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చి వారి గెలుపుకు తోడ్పడ్డాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో టెన్షన్‌గా కనిపించిన ట్రాట్.. ఆఫ్ఘన్ల గెలుపు అనంతరం ఎంతో సంతోషంగా కనిపించాడు. స్వదేశంపై తన వ్యూహాలు విజయవంతంగా అమలు కావడంతో ట్రాట్ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం పట్టరాని అనందంతో స్టేడియం మొత్తం కలిగతిరిగాడు.
ఇంగ్లండ్‌పై గెలుపు అనంతరం అతను మాట్లాడుతూ.. ఈ గెలుపు ఆఫ్ఘనిస్తాన్ యువతలో ఎంతో సూర్తిని నింపుతుందని అన్నాడు. ఇటీవల సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘన్లకు ఈ విజయం ఎంతో ఊరట కలిగిస్తుందని తెలిపాడు. ఈ గెలుపు ఆఫ్ఘన్ల ముఖాల్లో చిరునవ్వులు చిగురింపజేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు ఇచ్చే స్పూర్తితో ఆఫ్ఘన్ యువత బ్యాట్ పడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరోవైపు ఇంగ్లండ్‌పై గెలుపులో కీలకపాత్ర పోషించిన ముజీబ్, రషీద్‌లు తమ చారిత్రక గెలుపును భూకంప బాధితులకు అంకితం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో 1000 మందికిపైగా మరణించారు.
కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment