ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. ఆస్ట్రేలియా టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (భారత్, సౌతాఫ్రికా) ఘోర పరాజయాలను మూటగుట్టకుని, ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఆఫ్ఘన్ చేతిలో ఓటమితో పాటు ఈ టోర్నీలో ఇంగ్లండ్ మరో పరాజయాన్ని కూడా మూటగుట్టకుంది. టోర్నీ ఓపెనర్‌లో గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్.. బట్లర్ సేనను మట్టికరిపించి, గత వరల్డ్‌కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించి,పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది.
ఏంటీ దుస్థితి..
ఛాంపియన్ జట్లైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఏంటీ దుస్థితి అని విశ్లేషిస్తే.. ఒక్క కారణంగా తేటతెల్లమైంది. ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లో ఇతర జట్లతో పోలిస్తే పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రత్యర్దులను తక్కువ అంచనా వేయడం కారణంగా తగిన మూల్యం చెల్లించుకున్నాయి. ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్‌తో, ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల ఘెరపరాజయాలు మూటగట్టుకున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆయా జట్ల బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను తేలిగ్గా తీసుకుని ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఆ తర్వాత ప్రత్యర్ధులు భారీ స్కోర్లు చేయడంతో ఛేదనలో ఒత్తిడికిలోనై చేతులెత్తేశారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కామన్ విషయం ఏంటంటే.. రెండు సందర్భాల్లో బ్యాటర్ల దెబ్బకు పేస్ బౌలర్లే బలయ్యారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆసీస్ పేసర్లు స్టార్క్ (9 ఓవర్లలో 53), హాజిల్‌వుడ్ (9 ఓవర్లలో 60), కమిన్స్ (9 ఓవర్లలో 70)లను బ్యాటర్లు చితకబాదగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్లు ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (4 ఓవర్లలో 41), రీస్ టాప్లే (8.5 ఓవర్లలో 52), సామ్ కర్రన్ (4 ఓవర్లలో 46), మార్క్ వుడ్ (9 ఓవర్లలో 50)ను ఉతికి ఆరేశారు. మొత్తంగా చూస్తే నిర్లక్ష్యం, పేసర్ల వైఫల్యం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, ఆసీస్ కొంపలు ముంచాయి. వరుస ఓటములు రెండు జట్ల సెమీస్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తాయి.
ఇంగ్లండ్‌కు అలవాటే..
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని పరాజయాలు కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో ఈ జట్టు తమకంటే చిన్న జట్ల చేతుల్లో పరాభవాలను ఎదుర్కొంది. 1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే.. 2011 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్, 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లు ఇచ్చాయి.
ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్‌లో నిన్న (అక్టోబర్ 15) పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment