
2023 వన్డే ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఛేదనలో ఆది నుంచి తడబడుతూ వచ్చిన ఇంగ్లండ్.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఆఫ్ఘన్ బౌలర్లకు దాసోహమైంది.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3) ఇంగ్లండ్ లైనప్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) తలో చేయి వేసి ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (66) మినహాయించి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. బెయిర్‌స్టో 2, మలాన్ 32, రూట్ 11, బట్లర్ 9, లివింగ్‌స్టోన్ 10, సామ్ కర్రన్ 10, వోక్స్ 9, ఆదిల్ రషీద్ 20, మార్క్ వుడ్ 18 పరుగులు చేసి ఔటయ్యారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు.
వరల్డ్‌కప్‌లో రెండో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్..
2015 ఎడిషన్‌తో వన్డే ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి ఒక్క స్కాట్లాండ్‌పై మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఇదే ఆఫ్ఘనిస్తాన్ మొదటి, ఆఖరి విజయం. ఆతర్వాత ఈ జట్టు 2019 ఎడిషన్‌లో 9 మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలువలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆఫ్ఘన్లు.. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించి, ప్రపంచకప్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment