
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ‘తలా’ అంత త్వరగా బ్యాటింగ్‌కు వస్తాడని ఊహించలేదన్నాడు. ఇందుకు కారణమేమిటో తనకు అర్థంకాలేదంటూ సీఎస్‌కే బ్యాటర్లపై జోకులు వేశాడు.
ఐపీఎల్-2025లో భాగంగా సీఎస్‌కే శుక్రవారం ఆర్సీబీతో తలపడింది. సొంతమైదానం చెపాక్‌లో టాస్ గెలిచిన చెన్నై.. ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించగా.. రాహుల్ త్రిపాఠి (5) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 4, సామ్ కర్రన్ 8, శివం దూబే 19 పరుగులకు వెనుదిరిగారు.
తొమ్మిదో స్థానంలో ధోని
ఈ క్రమంలో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25) రాగా.. రవిచంద్రన్ అశ్విన్(8 బంతుల్లో 11) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక పవర్‌ఫుల్ ఫినిషర్‌గా పేర్కొంది ధోని తొమ్మిదో నంబర్‌లో బ్యాట్‌తో రంగంలోకి దిగి 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
A never ending story 😊
Last over 🤝 MS Dhoni superhits 🔥
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025
అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఆల్‌రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
43 ఏళ్ల ధోనిని కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో ఉంచితే.. సీఎస్‌కే మున్ముందు మరిన్ని చేదు అనుభవాలు చూస్తుందనే హెచ్చరికలు వస్తున్నాయి. జట్టుకు అవసరమైన వేళనైనా తలా ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారి ధోనిపై క్రిక్‌బజ్ షోలో జోకులు వేశారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి చాలా తొందరగానే బ్యాటింగ్‌కు వచ్చాడే!’’ అని సెటైర్ వేయగా.. ‘‘అవును.. నేనైతే అతడు పదో స్థానంలో వస్తాడేమో అనుకున్నా’’ అని బదులిచ్చాడు.

అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా?
ఇందుకు స్పందిస్తూ.. ‘‘16 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వచ్చాడు. మామూలుగా అయితే, 19 లేదా 20వ ఓవర్లోనే అతడు బ్యాటింగ్‌కు వస్తాడు. అందుకే త్వరగా వచ్చాడని అన్నాను. మీకూ అలాగే అనిపిస్తోందా?
అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి అతడిని రప్పించారా?’’ అని సెహ్వాగ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు.
కాగా ధోని ఈ మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన క్రమంలో.. సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు (204 ఇన్నింగ్స్‌లో 4699) సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉండేది. అతడు చెన్నై తరఫున 171 ఇన్నింగ్స్ ఆడి 4687 పరుగులు చేశాడు.
ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ బెంగళూరు
👉 బెంగళూరు స్కోరు: 196/7 (20)
👉చెన్నై స్కోరు: 146/8 (20)
👉ఫలితం: యాభై పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం.
చదవండి: ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్‌కే కోచ్ ఆగ్రహం