
స్టీఫెన్ ఫ్లెమింగ్ (Photo Courtesy: BCCI/CSK)
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్‌కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్‌కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులు
తాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.
అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.
ధోని ధనాధన్ సరిపోలేదు
మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.
A never ending story 😊
Last over 🤝 MS Dhoni superhits 🔥
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025
అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.
మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.
మమ్మల్ని తక్కువ చేయకండి
తొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.
మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!