
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 6న (ఆదివారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8కి వాయిదా పడింది. ఏప్రిల్ 8న (మంగళవారం) ఈ మ్యాచ్ అదే వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) కోల్‌కతా పోలీసుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను సవరించింది.
ఏప్రిల్ 6న శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు మ్యాచ్ జరుగనుండటంతో కోల్‌కతా పోలీసులకు మ్యాచ్ భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తేదీని వాయిదా వేయాలని క్యాబ్, కోల్‌కతా పోలిసులు బీసీసీఐని కోరారు. వారి అభ్యర్ధన మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను మార్చింది. కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడిన విషయాన్ని బీసీసీఐ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ మినహా మిగతా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేసింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. కేకేఆర్, లక్నో మ్యాచ్ మధ్యాహ్నం షెడ్యూలై ఉండగా.. అదే రోజు రాత్రి (7:30) సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడగా.. గుజరాత్, సన్‌రైజర్స్ మ్యాచ్ యధాతథంగా జరుగనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం కేకేఆర్, లక్నో మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి (7:30) చండీఘడ్‌లో పంజాబ్, సీఎస్‌కే ఢీకొంటాయి.
ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ఇవాళ (మార్చి 29) అహ్మదాబాద్ వేదికగా ముంబై, గుజరాత్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ముంబై సీఎస్‌కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో భంగపడ్డాయి. నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత సఫలమైన జట్టుగా ఆర్సీబీ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.