KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్‌ చేసిన హర్షిత్‌ రాణా | IPL 2025, KKR VS LSG: Will Harshit Rana Be Reprimanded For Breaching IPL Code Of Conduct | Sakshi
Sakshi News home page

KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్‌ చేసిన హర్షిత్‌ రాణా

Published Tue, Apr 8 2025 6:23 PM | Last Updated on Tue, Apr 8 2025 6:50 PM

IPL 2025, KKR VS LSG: Will Harshit Rana Be Reprimanded For Breaching IPL Code Of Conduct

Photo Courtesy: BCCI

గత ఐపీఎల్‌ సీజన్‌లో ఫ్లయింగ్‌ కిస్‌ సెలబ్రేషన్స్‌ ద్వారా బాగా పాపులరై ఏకంగా టీమిండియాలో స్థానం సంపాధించిన కేకేఆర్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా ఈ సీజన్‌లో మళ్లీ తన ఓవరాక్షన్‌ను మొదలు పెట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌  జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 8) జరుగుతున్న మ్యాచ్‌లో రాణా మరోసారి అతి సంబరాలు చేసుకున్నాడు. లక్నో ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆనందంలో 'బయటికి వెళ్లు' అన్నట్లుగా సైగ చేశాడు. ఈ అతి కారణంగా రాణా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నుంచి జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్డ్‌లోని ఆర్టికల్‌ 2.5 నిబంధన ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది.

ఈ నిబంధన ప్రకారం ఓ ఆటగాడు మరో ఆటగాడిని అవమానించే రీతిలో భాషను లేదా సంజ్ఞలను చేయకూడదు. ఔటైన బ్యాటర్‌ని ఉద్దేశిస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఈ నిబంధన ఉల్లంఘన కింది​కి వస్తుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో స్పిన్నర్‌ దిగ్వేష్‌ రాఠీ కూడా రాణా తరహాలోనే అతి సంబరాలు చేసుకుని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగ్రహానికి (జరిమానా) గురయ్యాడు. దిగ్వేష్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నోట్‌ బుక్‌ సంబరాలు చేసుకోవడాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది.

ఇదిలా ఉంటే, లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన కేకేఆర్‌ భారీగా పరుగులు సమర్పించుకుంది. రాణా సహా ప్రతి కేకేఆర్‌ బౌలర్‌ను లక్నో బ్యాటర్లు ఉతికి ఆరేశారు. రాణా 2 వికెట్లు తీసినా తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. 

లక్నో బ్యాటర్లు మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్‌ (36 బంతుల్లో 87; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్క్రమ్‌ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆ జట్టు కూడా లక్నో స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్‌ అయ్యర్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement