
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్‌లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్‌లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి.