
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్, సీఎస్‌కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లన్‌పూర్ స్టేడియంలో జరుగనుంది.
వారం మధ్యలో ఎందుకంటే..?
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్‌కతా పోలీసులు మ్యాచ్‌కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్, లక్నో మ్యాచ్ నేటి మధ్యాహ్నానికి వాయిదా పడింది.
ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు (అంచనా)..
కేకేఆర్: క్వింటన్ డికాక్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
లక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్
రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్‌కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. సీఎస్‌కే నాలుగింట మూడు ఓడి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 16, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు పంజాబే గెలిచింది.
తుది జట్లు (అంచనా)..
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి/అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ