వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి, జగజ్జేతను మట్టికరిపించారు.
తొలుత బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (22 బంతుల్లో 23; 3 ఫోర్లు), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్).. ఆ తర్వాత బౌలింగ్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3), మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) చెలరేగి విశ్వ విజేతకు ఊహించని షాకిచ్చారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
నాడు చితకబాదించుకున్నాడు.. ఇప్పుడు హీరో అయ్యాడు..!
ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంలో స్పిన్ ఆల్‌రౌండర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు తొలుత బ్యాట్‌తో అతి మూల్యమైన పరుగులు చేసి, ఆ తర్వాత బంతితో మాయ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ పాత్ర అత్యంత ప్రశంసనీయం. గత వరల్డ్‌కప్‌లో ఇదే ఇంగ్లండ్ చేతిలో చితకబాదించుకున్న రషీద్.. ఈ మ్యాచ్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
2019 వరల్డ్‌కప్‌లో నాటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) విధ్వంసం ధాటికి బలైన రషీద్.. ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులిచ్చి కెరీర్‌లో చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అతి ధారాళంగా పరుగులు సమర్పించుకుని నాడు తన జట్టు పాలిట విలన్ అయిన రషీద్.. నేడు అదే జట్టు పతనాన్ని శాసించి, హీరో అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment