
PC: BCCI/IPL.com
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేసేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత కెప్టెన్‌గా అతడి విజయాలను ఈ ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. అదే విధంగా వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్‌వేలకు శరద్ పవార్, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, డయానా ఎడుల్జీ వంటి దిగ్గజాల పేర్లు పెట్టాలని కొంతమంది ఎంసీఏ సభ్యులు సూచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీనిపై ఎంసీఏ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
ధోని తర్వాత..
భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంఎస్ ధోని తర్వాత భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ భారత్‌కు టీ20 వరల్డ్‌కప్-2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను అందించాడు.
ఎంఎస్ ధోని కెప్టెన్‌గా భారత్‌కు 3 ఐసీసీ ట్రోఫీలను అందించాడు. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.
చదవండి: IPL 2025: శార్ధూల్ ఠాకూర్ 'సెంచరీ'.. స్పెషల్ జెర్సీ అందజేత! వీడియో