CWC 2023: సంచలనాల ఆఫ్ఘనిస్తాన్‌కు సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సచిన్‌ | CWC 2023 AFG Vs AUS: Sachin Tendulkar Surprise Afghanistan Team Before Their Clash With Australia, Video Viral - Sakshi
Sakshi News home page

CWC 2023 AFG Vs AUS: సంచలనాల ఆఫ్ఘనిస్తాన్‌కు సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సచిన్‌

Published Tue, Nov 7 2023 11:41 AM | Last Updated on Tue, Nov 7 2023 12:15 PM

CWC 2023: Sachin Tendulkar Surprise Afghanistan Team Before Their Clash With Australia In Mumbai - Sakshi

భారత్‌ వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ముంబై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌ ఇవాళ (నవంబర్‌ 7) ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియాను ఢీకొట్టనుండగా.. సచిన్‌ ఆఫ్ఘన్‌ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో ప్రత్యక్షమై వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ సందర్భంగా సచిన్‌ ఆఫ్ఘన​ ప్లేయర్లతో పాటు సహాయ సిబ్బందితోనూ మాట్లాడాడు.

సచిన్‌ ఆఫ్ఘన్‌ కోచ్‌, ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జోనాథన్‌ ట్రాట్‌తో పలు పాత విషయాలను షేర్‌ చేసుకున్నాడు. సచిన్‌ సలహాలు ఇస్తుండగా ఆఫ్ఘన్‌ ప్లేయర్లు చాలా ఆసక్తిగా విన్నారు. ఆఫ్ఘన్‌ ప్లేయర్లలో రషీద్‌ ఖాన్‌ ఒక్కడే సచిన్‌తో మాట కలిపాడు. వరుస సంచలనాలు సాధిస్తున్న ఆఫ్ఘన్‌ క్రికెటర్లలో సచిన్‌ స్పూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహీదితో సైతం సచిన్‌ కాసేపు ముచ్చటించాడు. సచిన్‌ రాకతో ఆఫ్ఘన్‌ క్యాంప్‌లో కొత్త ఉత్సాహం కనపడింది.

ఇదే జోష్‌లో వారు ఆసీస్‌కు కూడా షాకివ్వాలని అనుకుంటున్నారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక లాంటి పటిష్టమైన జట్లను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు), న్యూజిలాండ్‌ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు), పాకిస్తాన్‌తో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు) పాటు సెమీస్‌ రేస్‌లో ఉన్న ఆఫ్ఘన్లు.. ఆసీస్‌పై కూడా గెలిచి ప్రపంచకప్‌లో తొలిసారి సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇది అషామాషీ విషయం కాదు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియన్లకు షాకివ్వడం ఆఫ్ఘన్లకు తాహతకు మించిన పనే అవుతుంది. ఈ మ్యాచ్‌ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ సౌతాఫ్రికాతోనూ ఓ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే వారు ఇతర జట్లతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్‌కు చేరుకుంటారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు గెలవడంపైనే కాకుండా రన్‌రేట్‌పై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. సెమీస్‌ రేసులో ఉన్న ఆసీస్‌ (0.924), న్యూజిలాండ్‌ (0.398), పాకి​స్తాన్‌లతో (0.036) పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌ రన్‌రేట్‌ (-0.330) చాలా తక్కువగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement