అఫ్గనిస్తాన్‌ చీటింగ్‌ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్‌ ఫైర్‌ | Afghanistan Accused Of Cheating After Act Gets Caught On Camera Fans Reacts | Sakshi
Sakshi News home page

అఫ్గనిస్తాన్‌ చీటింగ్‌ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Tue, Jun 25 2024 7:16 PM | Last Updated on Tue, Jun 25 2024 7:28 PM

Afghanistan Accused Of Cheating After Act Gets Caught On Camera Fans Reacts

PC: ICC

ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీస్‌ చేరిన అఫ్గనిస్తాన్‌ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌-2024లో అండర్‌డాగ్స్‌గా అడుగుపెట్టి టాప్‌-4లో నిలిచినందుకు రషీద్‌ ఖాన్‌ బృందాన్ని క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతోంది.

అయితే, అదే సమయంలో అడ్డదారిలో గెలిచారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి.. బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆ ఇద్దరిపై ఆగ్రహం
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ గుల్బదిన్‌ నైబ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..

వరల్డ్‌కప్‌-2024 సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ బంగ్లాదేశ్‌తో తలపడింది. సెయింట్‌ విన్సెంట్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

రహ్మనుల్లా గుర్బాజ్‌ రైజ్‌
ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ 43 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 19 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 18 రన్స్‌ తీయగా.. వేరెవరు కనీసం పది పరుగుల స్కోరు దాటలేదు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోరు చేసింది అఫ్గన్‌ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు అఫ్గన్‌ పేసర్లు.

ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో ఐదు పరుగులకే నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు.

పట్టుదలగా లిటన్‌ దాస్‌
ఇలాంటి క్లిష్ట సమయంలో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌(54 నాటౌట్‌) పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌ పన్నెండో ఓవర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

లిటన్‌ దాస్‌తో కలిసి తంజీమ్‌ హసన్‌ సకీబ్‌ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. పన్నెండో వోర్‌ వేసిన నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి తంజీమ్‌ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.

అదే సమయంలో అఫ్గన్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ వాన పడే అవకాశం ఉందని తమ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. కాస్త స్లోగా ఆడండని సైగలు చేశాడు.

తొడ కండరాల్లో నొప్పి అంటూ
అప్పటికి బంగ్లాదేశ్‌ స్కోరు 81/7.. డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌ అఫ్గనిస్తాన్‌ కంటే కేవలం రెండు పరుగులే వెనుకబడి ఉంది. అంటే.. ఆ సమయంలో వర్షం పడి.. ఆ తర్వాత మ్యాచ్‌ గనుక రద్దైపోతే ఫలితం అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు.

ఈ నేపథ్యంలో కోచ్‌ సైగల మేరకు స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నైబ్‌.. ఒ‍క్కసారిగా చేతి పైకెత్తి.. తొడ కండరాల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అతడి చేష్టలు చూసి కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ సైతం అసహనంగా కదిలాడు. అసలేమైంది అన్నట్లుగా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.

 

ఇంతలో నైబ్‌కు సబ్‌స్టిట్యూట్‌గా నజీబుల్లా మైదానంలోకి రాగా.. ఫిజియోలతో పాటు నైబ్‌ మైదానం వీడాడు. అప్పటికి వర్షం పడలేదు. కానీ నైబ్‌ వల్ల మ్యాచ్‌ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాతి బంతికి బంగ్లా ఒక పరుగు చేసింది. ఓవర్లో మొత్తంగా రెండు పరుగులే వచ్చాయి.

ఒకవేళ నైబ్‌ డ్రామా చేయకపోయి ఉంటే.. మరుసటి రెండు బంతుల్లో గనుక బంగ్లా రెండు పరుగులు చేసి.. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్‌ రద్దైతే కచ్చితంగా బంగ్లానే గెలిచేది.

సెమీస్‌ రేసు నుంచి అవుట్‌
అయితే, నైబ్‌ గాయం వల్ల ఆలస్యానికి తోడు వరణుడు కూడా అప్పటికి కరుణించడంతో మ్యాచ్‌ కొనసాగింది. ఇక పదమూడవ ఓవర్లో బంగ్లాదేశ్‌ కేవలం ఆరు పరుగులే చేయగా.. గ్రూప్‌-1 సమీకరణలకు అనుగుణంగా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

అప్పుడు సెమీస్‌ బెర్తు కోసం ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు డీఎల్‌ఎస్‌ పద్ధతిలో బంగ్లా ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించి విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా విధించారు అంపైర్లు. అయితే, అఫ్గన్‌ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ​ 17.5 ఓవర్లలో కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి
ఫలితంగా అఫ్గనిస్తాన్‌ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అంతకుముందు గాయంతో విలవిల్లాడిన గుల్బదిన్‌ నైబ్‌.. కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి ఓ వికెట్‌ తీయడంతో పాటు.. గెలుపు సంబరాల్లో అందరికంటే వేగంగా పరిగెత్తడం.

ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా గుల్బదిన్‌ నైబ్‌ ‘లీల’ల గురించి చర్చ మొదలైంది. కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అయితే.. ‘‘ఆస్కార్‌ గెలుచుకునే నటన.. ఆ ఫిజియోలు సూపర్‌.. మరీ ఇంత త్వరగా గాయం నుంచి కోలుకోవడం నిజంగా ఆశ్చర్యమే’’ అంటూ సెటైర్లు వేశాడు.

టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం గుల్బదిన్‌కు రెడ్‌కార్డ్‌ ఇవ్వాలంటూ సరదాగా కామెంట్‌ చేయగా.. అతడు బదులిస్తూ ఒక్కోసారి సంతోషం.. ఒక్కోసారి దుఃఖం అంతే అంటూ అంతే లైట్‌గా తీసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement