
Photo Courtesy: BCCI
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్‌తో జరిగిన రద్దైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్‌కే ఆడుతున్న ప్రభ్‌సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్‌లు ఆడి 151.88 స్ట్రయిక్‌రేట్‌తో 1048 పరుగులు చేశాడు.
ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్‌గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్‌కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్‌లు ఆడి 2548 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
కేఎల్ రాహుల్- 2548
షాన్ మార్ష్- 2477
డేవిడ్ మిల్లర్- 1974
మయాంక్ అగర్వాల్- 1513
మ్యాక్స్‌వెల్- 1431
క్రిస్ గేల్- 1339
సాహా- 1190
మనన్ వోహ్రా- 1106
మన్‌దీప్ సింగ్- 1073
ప్రభ్‌సిమ్రన్ సింగ్- 1048
కుమార సంగక్కర- 1009
కాగా, నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్‌సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.
నిన్నటి మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్‌వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్‌వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్‌లో) ఉంది. ఈ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి.