ప్రీతి జింటా- రిక్కీ పాంటింగ్ (PC: PBKS)
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.
ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్‌తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడేళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్‌కు చేరింది. కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.
కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్‌గా నియమించింది.
చెత్త రికార్డుతో పంజాబ్
ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్‌లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్‌ను రంగంలోకి దింపింది.
ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.
యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదే
ఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు.
ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.
రికార్డు ధరకు అయ్యర్‌ను కొని
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్‌ను తమ సారథిగా నియమించింది.
అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.
చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా
Comments
Please login to add a commentAdd a comment