
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో హిట్‌మ్యాన్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్-2023 మాదిరి ఈ మెగా టోర్నీలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడుగానే ఆడతాడని అంచనా వేశాడు.
ఘోర పరాభవాలు
కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ముంబైకర్.. గతేడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఘోర పరాభవం పాలైంది.
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయింది. అనంతరం.. టెస్టులతో బిజీ అయిన రోహిత్ శర్మ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో, ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో ఈ రెండు సిరీస్‌లనూ టీమిండియా కోల్పోయింది.
అనంతరం రంజీ బరిలో దిగిన రోహిత్ శర్మ అక్కడా ముంబై ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంఓ 37 ఏళ్ల రోహిత్ శర్మను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుందని పేర్కొన్నాడు.
అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం
‘‘చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడతాడని అనుకుంటున్నా. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ అతడు అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడు. కాబట్టి ఈసారీ అదే జోరు కొనసాగిస్తాడు. అయితే, అతడితో పాటు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగేది ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.
శుబ్‌మన్ గిల్ వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ గిల్ గనుక ఓపెనర్‌గా ఉంటే.. అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం. ఏదేమైనా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కానుంది. ఒకవేళ ఇందులో గనుక భారత్ గెలిస్తే.. నాలుగు ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన తొలి టీమిండియా ప్లేయర్‌గా అతడు చరిత్రకెక్కుతాడు.
ఇక సారథిగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. అయితే, అతడు ఈ టోర్నీలో బ్యాటర్‌గానూ రాణించాల్సి ఉంది’’ అని సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.
కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ఇక కెప్టెన్‌గా 2024 టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీనీ ముద్దాడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడుతున్నాయి.
చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment