CT 2025: అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్‌ | R Ashwin Blunt Message To Rohit Sharma Wants Change In India CT Squad | Sakshi
Sakshi News home page

CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్‌

Published Tue, Feb 4 2025 12:55 PM | Last Updated on Tue, Feb 4 2025 1:57 PM

R Ashwin Blunt Message To Rohit Sharma Wants Change In India CT Squad

టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌(India vs England) ఆసాంతం అదరగొట్టాడు ఈ కర్ణాటక బౌలర్‌. ఐదు టీ20లలో కలిపి పద్నాలుగు వికెట్లతో మెరిసిన ఈ రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు.

అంతేకాదు.. ఒక ద్వైపాక్షకి సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన తొలి స్పిన్‌ బౌలర్‌గానూ వరుణ్‌ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న వరుణ్‌ చక్రవర్తికి వరుస అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

అతడిని జట్టులోకి తీసుకోండి
ఈ క్రమంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్టులో వరుణ్‌ చక్రవర్తిని చేరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అతడిని ఆడించాలని సూచించాడు.

కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫ్రీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో అశ్విన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అతడు చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తారనే భావిస్తున్నా.

సమయం మించిపోలేదు
ఎందుకంటే.. ఈ టోర్నీలో ఆడుతున్న అన్ని దేశాలు తమ ప్రాథమిక జట్లను మాత్రమే ప్రకటించాయి. కాబట్టి వరుణ్‌కు ఈసారి ఛాన్స్‌ ఇస్తారేమో అనిపిస్తోంది. అయితే, నేరుగా ఐసీసీ టోర్నీ జట్టుకు ఎంపిక చేయడం అంత సులువేమీ కాదు.

అదీగాక అతడు ఇంకా వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు. అందుకే తొలుత ఇంగ్లండ్‌తో వన్డేల్లో వరుణ్‌ని ఆడించి.. ఆ తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అతడికి తప్పక అవకాశం ఇస్తారని అశ్విన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను ఎంపిక చేసింది. ఇక వరుణ్‌ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకుంటే ఐదో స్పెషలిస్టు స్పిన్నర్‌ అవుతాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు.  

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా(ఫిట్‌నెస్‌ ఆధారంగా) మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌.
ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లు: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.

చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement