
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్, ఆర్సీబీ రెండు రోజుల కిందటే బెంగళూరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది.
ఇవాళ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. కృనాల్ పాండ్యా (4-0-25-2), సుయాశ్ శర్మ (4-0-26-2), రొమారియో షెపర్డ్ (2-0-18-1) చెలరేగడంతో పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 33, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1 పరుగు చేసి ఔట్ కాగా.. శశాంక్ సింగ్ 25, జన్సెన్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆ ఫ్రాంచైజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ పంజాబ్ కింగ్స్ తరఫున 959 పరుగులు (51 మ్యాచ్‌ల్లో) చేయగా.. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ యువీ పరుగుల సంఖ్యను దాటేశాడు.
ప్రభ్‌సిమ్రన్ పంజాబ్ తరఫున 42 మ్యాచ్‌ల్లోనే 965 పరుగులు చేశాడు. సగటు, స్ట్రయిక్‌రేట్‌లోనూ ప్రభ్‌సిమ్రన్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉన్నాడు. పంజాబ్ తరఫున యువీ యావరేజ్ 22.30గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ యావరేజ్ 22.97గా ఉంది. యువీ స్ట్రయిక్‌రేట్ 127.86గా ఉండగా.. ప్రభ్‌సిమ్రన్ స్ట్రయిక్‌రేట్ 150.55గా ఉంది.
టాప్‌లో కేఎల్ రాహుల్.. 12వ స్థానంలో ప్రభ్‌సిమ్రన్
ఐపీఎల్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (2548) ఉన్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్‌వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్‌దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) ఉన్నారు. ప్రభ్‌సిమ్రన్ ప్రస్తుతం పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.
ప్రభ్‌సిమ్రన్ ప్రస్తానం ఇలా..
2019 సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రభ్‌సిమ్రన్ 2023, 2024 సీజన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 358 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్.. 2024 సీజన్‌లోనూ 14 మ్యాచ్‌ల్లో 334 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 2023 సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు పంజాబ్ ప్రభ్‌సిమ్రన్‌ను రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్నాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.