Ashes 5th Test: Moments That Will Remember For Stuart Broad For Life Time - Sakshi
Sakshi News home page

Stuart Broad: స్టువర్ట్‌ బ్రాడ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు.. 

Published Sun, Jul 30 2023 5:52 PM | Last Updated on Sun, Jul 30 2023 6:01 PM

Ashes 5th Test: Moments That Will Remember For Stuart Broad For Life Time - Sakshi

యాషెస్‌ సిరీస్‌ 2023 చివరి టెస్ట్‌ సందర్భంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు తన కెరీర్‌లో చివరిసారి బ్యాటింగ్‌కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్‌.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్‌తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్‌ క్రికెటర్ల  నుంచి బ్రాడ్‌ గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్నాడు.

ఆసీస్‌ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్‌ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్‌.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్‌ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్‌, బ్రాడ్‌ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు.

బ్రాడ్‌ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్‌ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్‌ తరఫున సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌ కలిగిన బ్రాడ్‌కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. 

అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన బ్రాడ్‌.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్‌ ఆఖరి బంతి) స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో ఆండర్సన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌ (8) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్‌ 384 పరుగులైంది. 

అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్‌.. నాలుగో రోజు లంచ్‌ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (39), డేవిడ్‌ వార్నర్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్‌ గెలుపుకు 10 వికెట్లు కావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement