
PC: BCCI/IPL.com
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హీథర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భర్తీ చేయనుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ హీథర్ నైట్ రాజీనామా చేసింది.
మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో నైట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రధాన కోచ్ జాన్ లూయిస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియమించింది.
ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపిక అయిన తర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచన మెరకు నా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాను.
2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు నా వంతు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. స్కైవర్-బ్రంట్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. హీథర్ నైట్ గైర్హజరీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించింది.
చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం