
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించేందుకు బెంగళూరు జట్టు కేవలం అడుగు దూరంలో నిలిచింది.
అయితే ఆర్సీబీ జైత్ర యాత్రలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాది కీలక పాత్ర. బ్యాటింగ్, బౌలింగ్‌లో కృనాల్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో పాండ్యాపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. కృనాల్ పాండ్యా ఆర్సీబీ కెప్టెన్సీకి అర్హుడు అని గవాస్కర్ కొనియాడాడు.
"కృనాల్ పాండ్యా అద్భుతమైన క్రికెటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అదరగొడుతున్నాడు. ఎవరూ అతడిని కెప్టెన్సీ రోల్‌కి పరిగణలోకి తీసుకోరు. కానీ నా వరకు అయితే కృనాల్ కెప్టెన్సీ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే అతడికి అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.
మైదానంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున మూడు సీజన్లు ఆడిన పాండ్యాను.. సదరు ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు విడుదల చేసింది. ఈ క్రమంలో మెగా వేలంలో ఆర్సీబీ రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ ఏడాది సీజన్‌లో పాండ్యా తన ధరకు తగ్గ న్యాయం చేస్తున్నాడు. బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్ లో 97పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులతో పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ గైర్హజరీలో లక్నో జట్టు సారథిగా కృనాల్ పాండ్యా వ్యవహరించాడు.