
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. మే రెండో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.
అయితే ఇంగ్లండ్ టూర్‌కు తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. సుదర్శన్ ఇప్పటికే టీ20, వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో డెబ్యూ చసే సూచనలు కన్పిస్తున్నాయి. అతడికి ఇంగ్లండ్ రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.
సుదర్శన్ కౌంటీ క్రికెట్‌లో సర్రే తరపున ఆడాడు. అదేవిధంగా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రజిత్ పాటిదార్‌లకు తిరిగి పిలుపునివ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయ్యర్, పాటిదార్ ఇద్దరూ గతేడాది భారత టెస్టు జట్టుకు దూరంగా ఉన్నారు.
అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మిడిలార్డర్‌లో అప్షన్స్ కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. సుదర్శన్, పాటిదార్, అయ్యర్‌లను ముందే ఇంగ్లండ్‌కు పంపించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు భారత-ఎ జట్టు తరపున ఇంగ్లండ్ లయన్స్‌తో అధికారిక టెస్టు సిరీస్ ఆడనున్నారు.