ఇంగ్లండ్‌ దీటైన జవాబు  | Alastair Cook Century | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ దీటైన జవాబు 

Published Thu, Dec 28 2017 12:34 AM | Last Updated on Thu, Dec 28 2017 12:34 AM

Alastair Cook Century - Sakshi

మెల్‌బోర్న్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి మెరుగైన ప్రదర్శన చేసింది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు రెండో రోజు సమష్టిగా రాణించింది. తొలుత బౌలర్లు రాణించి ఆస్ట్రేలియాను 327 పరుగులకు కట్టడి చేయగా... అనంతరం సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ (166 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 192 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయని కుక్‌ ఈ టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు.

టెస్టు కెరీర్‌లో అతనికిది 32వ సెంచరీ. స్టోన్‌మన్‌ (15), విన్స్‌ (17)లు తక్కువ స్కోరుకే అవుటవడంతో 80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను కెప్టెన్‌ రూట్‌ (49 బ్యాటింగ్‌)తో కలిసి కుక్‌ ఆదుకున్నాడు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అభేద్యమైన మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 135 పరుగులు వెనుకబడి ఉంది.  అంతకుముందు 244/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ బౌలర్లు బెంబేలెత్తించారు. పేసర్లు బ్రాడ్‌ (4/51), అండర్సన్‌ (3/61)ల ధాటికి ఆ జట్టు 67 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి 327 పరుగులకు పరిమితమైంది. స్మిత్‌ (76; 8 ఫోర్లు)తో పాటు షాన్‌ మార్‌‡్ష (61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో సాధించాడు.  

►7 అత్యధిక సెంచరీల జాబితాలో స్టీవ్‌ వా (32)తో సమంగా అలిస్టర్‌ కుక్‌ ఏడో స్థానంలో నిలిచాడు.  
►8 అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్ధనే (11814)ను దాటి కుక్‌ (11816) ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement