![Sunil Gavaskar could miss trophy presentation ceremony after Sydney Test - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/2/BORDER-GAVASKAR.jpg.webp?itok=hNNm3Atl)
ముంబై: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ పేరేమో ‘బోర్డర్–గావస్కర్’ టోర్నీ. చిత్రంగా ట్రోఫీ ప్రదానోత్సవానికి మాత్రం భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ఆహ్వానం పంపలేదు. దీంతో సన్నీ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించడం లేదు. 1996 నుంచి జరుగుతున్న ఈ సిరీస్ విజేతకు ఈసారి మాత్రం అలెన్ బోర్డర్ ఒక్కడే ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ గత మే నెలలో గావస్కర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్ తన 17 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలానికి బైబై చెప్పారు. ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం సీఏ నుంచి అధికారిక ఆహ్వానమేదీ సన్నీకి అందలేదు. ఒకవేళ సీఏ హడావుడిగా ఇప్పుడు ఆహ్వానం పంపినా గావస్కర్ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే సన్నీ ‘సోనీ నెట్‌వర్క్’తో ఒప్పందం చేసుకున్నారు. ముంబై నుంచి వ్యాఖ్యానం చేస్తున్నారు.
కనీసం సిరీస్‌కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని సన్నీ చెప్పారు. దీంతో భారత దిగ్గజం గైర్హాజరు కానున్నారు. మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్ హెడ్ టిమ్ విటకెర్ మాట్లాడుతూ... జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గావస్కర్‌కు ఆహ్వానాలు పంపామని చెప్పారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్‌షాట్స్ చూపగలరా అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం’ అని బదులిచ్చారు. సీఏ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2015లో చివరి నిమిషంలో ఆహ్వానించింది. అక్కడే ఉండటంతో సన్నీ సరేనన్నారు. 2007–08లోనూ ఇలాగే చేసింది. 2000లో ఆస్ట్రేలియా శతాబ్ది జట్టును ఎంపిక చేసేందుకు సీఏ గావస్కర్‌ను ఆ ప్యానెల్‌లో సెలెక్టర్‌గా నియమించింది. వేడుకకి మాత్రం పిలవలేదు.
Comments
Please login to add a commentAdd a comment