మళ్లీ ఓడిన భారత మహిళలు | Indian women lose again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత మహిళలు

Published Fri, Mar 23 2018 1:28 AM | Last Updated on Fri, Mar 23 2018 1:28 AM

Indian women lose again - Sakshi

ముంబై: ఫార్మాట్‌ మారినా భారత మహిళా క్రికెట్‌ జట్టు రాత మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో 0–3తో చిత్తయిన మన జట్టు... ఇప్పుడు టి20 ముక్కోణపు టోర్నీని కూడా పరాజయంతో ప్రారంభించింది.  గురువారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో భారత్‌పై సునాయాసంగా గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసి విజయాన్నందుకుంది.  ఓపెనర్లు స్మృతి మంధాన (41 బంతుల్లో 67; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్‌ (18) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 9.3 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. ముఖ్యంగా మైదానం నలువైపులా షాట్లు కొట్టిన స్మృతిమంధాన 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది.

మరో ఎండ్‌లో మిథాలీ అవుటైనా ఆమె జోరు కొనసాగించింది. టి20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధశతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మంధాన 13వ ఓవర్లో గార్డ్‌నర్‌ (2/21) బౌలింగ్‌లో అవుటైంది. తర్వాత వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (13), జెమీమా (1) విఫలమవడంతో రన్‌రేట్‌పై ప్రభావం పడింది. వేదా కృష్ణమూర్తి (10 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌), అనూజ పాటిల్‌ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝళిపించారు. లక్ష్య ఛేదనలో భారత పేసర్‌ జులన్‌ గోస్వామి (3/30) ధాటికి ఆసీస్‌ 29 పరుగులకే ఓపెనర్‌ అలీసా హీలీ (4), గార్డ్‌నర్‌ (15)ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ మూనీ (32 బంతుల్లో 45; 8 ఫోర్లు), విలానీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. లానింగ్‌ (25 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ మరో  11 బంతులు ఉండగానే విజయం సాధించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement