359 పరుగుల భారీ విజయలక్ష్యం... 12 పరుగులకే 2 వికెట్లు... అయితే ఆస్ట్రేలియా బెదరలేదు. తమకు అచ్చి వచ్చిన మైదానంలో ఆ జట్టు పట్టుదలగా నిలబడింది. హ్యాండ్స్‌కోంబ్, ఖాజా ఒక్కో పరుగు పేర్చుకుంటూ 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవకాశం సృష్టించారు. అయినా సరే వీరిద్దరితో పాటు మ్యాక్స్‌వెల్ వెనుదిరిగాక పరిస్థితి కష్టంగానే కనిపించింది. ఇంతలో ఇన్నింగ్స్‌ను తమవైపు టర్న్ చేస్తూ టర్నర్ దూసుకొచ్చాడు. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న అతను ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కోహ్లి సేన ఈ అనూహ్య షాక్ నుంచి కోలుకునే లోపే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఫలితంగా తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించి ఆసీస్ సిరీస్‌లో నిలబడింది. అంతకుముందు వన్డేల్లో 100వసారి ఓపెనింగ్ భాగస్వాములుగా బరిలోకి దిగిన ధావన్, రోహిత్ శర్మ తమ స్థాయిని ప్రదర్శించారు. ఫలితంగా తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు భారీ పునాది పడింది. విరాట్ విఫలమైనా ఇతర బ్యాట్స్‌మెన్ తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు నమోదైంది. అయితే ఇది కూడా జట్టు విజయానికి సరిపోలేదు. మంచు ప్రభావం ఉంటుందని తెలిసీ తమ బౌలర్లకు అలవాటేనంటూ కోహ్లి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా... చివర్లో మన బౌలర్లు చేతులారా మ్యాచ్‌ను వదిలేశారు.
మొహాలీ: ఆస్ట్రేలియా అద్భుత ఆటతీరుతో వన్డే సిరీస్‌లో సమంగా నిలిచింది. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. రోహిత్ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కమిన్స్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం నమోదు చేయగా, ఉస్మాన్ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆస్టన్ టర్నర్ (43 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో వన్డే బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది.
ఓపెనింగ్ అదిరింది...
వరల్డ్ కప్‌కు ముందు ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ధావన్ అందులో సఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలచి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతను చివరి వరకు అదే జోరును కొనసాగించాడు. వరుస బౌండరీలతో చెలరేగిన అతను ఒక దశలో 17 బంతుల వ్యవధిలో మరో 6 ఫోర్లు కొట్టడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. ఇందులో ధావన్ 42 చేస్తే రోహిత్ చేసినవి 16 పరుగులే. ఆ వెంటనే ధావన్ 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 61 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరు ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. అయితే సెంచరీకి చేరువలో రోహిత్ వెనుదిరిగాడు. జంపా వేసిన తర్వాతి ఓవర్లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి ధావన్ (97 బంతుల్లో) శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ధావన్ తాను ఎదుర్కొన్న 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా బెహ్రన్‌డార్ఫ్ ఓవర్లో వరుస బంతుల్లో కొట్టిన 4, 6, 4 అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఎట్టకేలకు కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతని ఆట ముగిసింది. ధావన్ ఔటయ్యాక 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 256/2. తర్వాతి 12 ఓవర్లలో జట్టు 102 పరుగులు జోడించగలిగింది. కోహ్లి (7) అరుదైన రీతిలో విఫలమైనా... రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) చలవతో స్కోరు 350 పరుగులు దాటగలిగింది. మరోవైపు మూడో స్థానంలో బరిలోకి దిగి తనకు లభించిన అతి కీలకమైన అవకాశాన్ని రాహుల్ (26; 1 ఫోర్) పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కేదార్ జాదవ్ (10) కూడా విఫలం కాగా, 27 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన బుమ్రా... తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి సిక్స్ కొట్టడం విశేషం.
భారీ భాగస్వామ్యం...
ఆసీస్ ఇన్నింగ్స్‌లోని తొలి ఓవర్ నాలుగో బంతికే ఫించ్ (0)ను భువనేశ్వర్ బౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కొద్ది సేపటికే షాన్ మార్‡్ష (6)ను బుమ్రా పెవిలియన్ పంపించాడు. అయితే ఖాజా, హ్యాండ్స్‌కోంబ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ భారీ భాగస్వామ్యంతో ఆసీస్‌ను ఆదుకున్నారు. ఈ జోడీని విడదీయడానికి భారత్ అన్ని ప్రయత్నాలూ చేసింది. జాదవ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఫోర్ బాదిన హ్యాండ్స్‌కోంబ్ 99 వద్దకు చేరుకోగా... తర్వాతి ఓవర్లోనే ఖాజా ఔటై వరుసగా రెండో సెంచరీని చేజార్చుకున్నాడు. 92 బంతుల్లో హ్యాండ్స్‌కోంబ్ శతకం పూర్తి చేసుకోగా... క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) స్విచ్‌హిట్‌కు ప్రయత్నించి కుల్దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే కుల్దీప్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టిన ఆసీస్ తమ జోరును కొనసాగించింది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి చహల్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్ వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అయితే క్యారీ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు) అండగా టర్నర్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్ గతిని మార్చేసి 13 బంతుల ముందే గెలిపించాడు.
టర్నింగ్ పాయింట్...
ఆస్టన్ టర్నర్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి ఆసీస్ 14 ఓవర్లలో 130 పరుగులు చేయాల్సి ఉంది. సొంతగడ్డపై భారత బౌలింగ్ బలగాన్ని బట్టి చూస్తే ప్రత్యర్థికి ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యం! కానీ టర్నర్ దానిని చేసి చూపించాడు. తానొక్కడే 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ప్రతీ బౌలర్‌పై అతను విరుచుకుపడ్డ తీరు అభినందనీయం. కుల్దీప్ బౌలింగ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో మొదలు పెట్టి చహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో జోరును కొనసాగించాడు. భువనేశ్వర్ వేసిన 45వ ఓవర్లో టర్నర్ 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గింది. బుమ్రా బౌలింగ్‌లో పూర్తిగా కుడి వైపునకు జరిగి ఫైన్ లెగ్ మీదుగా టర్నర్ కొట్టిన సిక్సర్ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్. భువీ తర్వాతి ఓవర్లో అతను మళ్లీ 6, 4 బాదగా క్యారీ మరో ఫోర్‌తో దానిని కొనసాగించడంతో ఆసీస్ విజయానికి అడ్డు లేకుండా పోయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 38 పరుగులిచ్చాడు.
► 6 ఆరేళ్ళ విరామం తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయింది.
►27 వన్డేల్లో భారత జట్టు 350 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన సందర్భాలు. ఈ విషయంలో దక్షిణాఫ్రికాతో భారత్ సమానంగా నిలిచింది.
►1 వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ధోని (217) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ (218) సవరించాడు. ఓవరాల్‌గా ధోని 224 సిక్స్‌లు కొట్టినా... ఏడు సిక్స్‌లు ఆసియా జట్టు తరఫున ఆడినపుడు వచ్చాయి.
మళ్లీ మళ్లీ మిస్సింగ్...
టర్నర్ 38 పరుగుల వద్ద ఉన్నప్పుడు చహల్ బౌలింగ్‌లో పంత్ సునాయాస స్టంప్‌ను వదిలేయడం కూడా భారత్ ఓటమికి కారణమైంది. ఆ తర్వాత అతను తన దూకుడుతో మరో 46 పరుగులు అదనంగా జోడించాడు. ఆ తర్వాత రెండు బంతుల వ్యవధిలో టర్నర్ ఇచ్చిన క్యాచ్‌లను జాదవ్, ధావన్ వదిలేశారు. మంచు ప్రభావం వల్ల బౌలర్లకు పట్టు చిక్కలేదనేది వాస్తవమే అయినా ఇంత భారీ స్కోరును కూడా భారత్ కాపాడుకోలేకపోవడం అనూహ్యం.
ఎవరీ టర్నర్?
హైదరాబాద్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన టర్నర్‌కు ఇది రెండో వన్డే మాత్రమే. 2017 ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన టర్నర్ గత రెండేళ్లలో మూడు సార్లు గాయపడటంతో మూడు సార్లు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. వన్డేలకు ముందు 5 టి20లు ఆడినా మొత్తం కలిపి చేసింది 26 పరుగులే. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా కెరీర్‌ను ఆరంభించినా ఆ తర్వాత సూపర్ ఫినిషర్‌గా మారాడు. గత రెండేళ్లలో బిగ్‌బాష్ లీగ్‌లో 15 నుంచి 20 ఓవర్ల మధ్య అతనిలా 194.69 స్ట్రయిక్‌రేట్‌తో... 48.40 సగటుతో ఎవరూ పరుగులు చేయలేకపోయారు. 2019 బిగ్‌బాష్‌లో అతను ఆసీస్ క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారాడు. ఇందులో పెర్త్ స్కార్చర్స్ తరఫున టర్నర్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వరుసగా 49, 24, 60 నాటౌట్, 43 నాటౌట్, 60, 1 పరుగులు చేశాడు. చాలా కాలంగా ఆసీస్‌ను వేధిస్తున్న డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కొరతను టర్నర్ పూర్తి చేయగలడని సెలక్టర్లు నమ్మారు. సొంతగడ్డపై భారత్‌తో సిరీస్ ఎంపికైనా మ్యాచ్ అవకాశం దక్కలేదు. మొహాలీ వన్డేలో కూడా స్టొయినిస్ గాయంతో దూరం కావడంతో తుది జట్టులోకి వచ్చాడు. భారత గడ్డపై టర్నర్ తాజా ప్రదర్శన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌ను కచ్చితంగా సంతోషపెట్టి ఉంటుంది. ఫినిషర్ రూపంలో టర్నర్‌ను చూస్తున్న ఆ జట్టు రూ. 50 లక్షలకు అతడిని దక్కించుకుంది.
వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది.
– కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment