"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను.
ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు.
ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్‌సీఏది కీలక పాత్ర.
నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్‌సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు.
ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్‌కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది.
యువ ఓపెనర్లకు పెద్దపీట
బంగ్లాదేశ్‌తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది.
చోటు ఆశించి భంగపడ్డా
మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన మేనేజ్‌మెంట్ ధావన్‌కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు.
ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు.
అందుకే ఇలా
ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్‌ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment