క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్‌ను రోల్ చేయడం సహా కోచ్‌లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.
కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్‌కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్‌లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్‌కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.
టీమిండియాలో చోటు కరువు
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్‌కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్‌బై చెప్పాడు.
ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.
కోచ్‌లకు ‘టీ’ అందించేవాడిని
ఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.
పిచ్‌ను రోల్ చేయడం, కోచ్‌ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
కుమారుడికి దూరంగా..
కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌తో కలిసి జోరావర్‌కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.
ఇక కుమారుడు జొరావర్‌ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.
చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment