
అండర్-19 వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.
వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు.
ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్‌కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు.
ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్‌ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు.
అన్న అడుగుజాడల్లో..
ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది.
తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన ముషీర్‌ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.