టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్‌కు కూడా దూరమయ్యాడు.
జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్‌కు చోటు కరువైంది.
యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.
ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్‌కు మొండిచేయి చూపింది.
ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్‌కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్‌లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ పంజాబ్‌ను ముందుకు నడిపించాడు.
అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment